Maharashtra political crisis: పవార్‌ X పవార్‌ | Sakshi
Sakshi News home page

Maharashtra political crisis: పవార్‌ X పవార్‌

Published Sat, Jul 8 2023 4:35 AM

Maharashtra political crisis: Sharad Pawar vs Ajit Pawar NCP War - Sakshi

మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో పోరు ముదురుతోంది. ఎన్సీపీ ఎవరిది? శరద్‌ పవార్‌దా? అజిత్‌ పవార్‌దా? ఎవరికి వారే పార్టీ తమదేనని వాదిస్తున్నారు. చిన్నాన్నపై ఎదురు తిరిగి అధికార బీజేపీ కూటమితో కలిసిపోయిన అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పార్టీ అధ్యక్ష పదవి నుంచి శరద్‌ పవార్‌ను తొలగించామని తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం తమకే కేటాయించాలని ఆ లేఖలో కోరారు.

ఆ మర్నాడే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన శరద్‌ పవార్‌ తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఇలా ఇరు వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శన కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తూ మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచాయి. పారీ్టల్లో చీలికలు, ఏది అసలు సిసలు పార్టీ అన్న ప్రశ్నలు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తేం కాదు. ఇదే ఏడాది మహారాష్ట్రలో శివసేనలో చీలికలు ఏర్పడినప్పుడు ఏక్‌నాథ్‌ షిండే చీలిక వర్గానికే విల్లు బాణాలు గుర్తుని కేటాయించి అదే అసలైన శివసేన అంటూ ఈసీ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్‌సీపీ వంతు వచి్చంది.   

ఎవరి బలాలు ఏంటి?
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకున్న 53 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతానికి 32 మంది ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌ వెంట ఉన్నారు. ఆ సంఖ్య 36కి చేరుకుంటే ఎలాంటి అనర్హత వేటు లేకుండా అధికార పక్షంలో కలిసిపోవచ్చు. ఇక ఎన్నికల గుర్తు రావాలన్నా మెజారీ్టయే కీలకం. అజిత్‌ పవార్‌ నాలుగు దశాబ్దాలుగా ఎన్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు పట్టు ఉంది. ఎంతో మంది కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకుల మద్దతు అజిత్‌ పవార్‌కు ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే పవార్‌కు ఇలా పార్టీని వీడడం కొత్త కాదు. గతంలో పలు మార్లు బయటకు వచ్చి తిరిగి శరద్‌ పవార్‌కే జై కొట్టిన సందర్భాలున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు ఆయనను ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో కలిసి పోటీ చేస్తే టికెట్లు ఎంతమందికి వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్డీయేతో కలిస్తే ముస్లిం, దళిత ఓట్లు పోగొట్టుకుంటామన్న ఆందోళన కూడా చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే ఆఖరి నిమిషంలో ఎంతమంది అజిత్‌ పవార్‌ వెంట నడుస్తారన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. ఇక మహారాష్ట్ర దిగ్గజ నాయకుడిగా శరద్‌ పవార్‌కున్న పాపులారిటీయే వేరు. గత కొన్ని దశాబ్దాలుగా గౌరవప్రదమైన రాజకీయ నాయకుడిగా హోదా అనుభవిస్తున్నారు. ఆయన కనుసైగ చేస్తే చాలు ఎలాంటి పనినైనా చక్కపెట్టగల అనుచరగణం ఉంది. 82 ఏళ్ల శరద్‌ పవార్‌కు ఆయన వయసే ప్రతిబంధకంగా మారింది.  

మెజారీ్టయే శిరోధార్యం  
ఏ పారీ్టలోనైనా మెజార్టీ ఎమ్మెల్యేలు, పార్టీలో జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అత్యధికులు ఎవరివైపు ఉంటే వారిదే అసలైన పార్టీ అని ఈసీ తేలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి పార్టీని స్థాపించిన వారు కాకుండా మెజార్టీ ఎవరి వైపు ఉంటే వారికే పారీ్టని, గుర్తుని కేటాయిస్తుంది. 1968లో ఎన్నికల గుర్తుకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులున్నాయి. ఈ ఉత్తర్వుల కింద మొట్టమొదటిసారిగా కాంగ్రెస్‌ పారీ్టలో చీలికల కేసుని పరిష్కరించారు.1969లో కె.కామరాజ్, నీలం సంజీవరెడ్డి, ఎస్‌. నిజలింగప్ప, అత్యుల ఘోష్‌ వంటి నాయకులు ఒక్కటై ఇందిరాగాందీని పార్టీ నుంచి బహిష్కరించారు.

దీంతో పార్టీ రెండుగా విడిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో పాత కాంగ్రెస్‌కే అధికారిక గుర్తు కాడెద్దులు గుర్తు దక్కింది. 1968కి ముందు ఎన్నికల నిబంధనలు, 1961 కింద కార్యనిర్వాహక ఉత్తర్వుల జారీతో ఈసీ ఈ వివాదాన్ని పరిష్కరించేది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) చీలిక అతి పెద్దదిగా చెప్పుకోవాలి. సీపీఐ (మార్క్సిస్టు) వర్గం తమని ప్రత్యేక పారీ్టగా గుర్తించాలని కోరింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతుగా ఉన్నట్టుగా ఈసీకి లేఖ సమరి్పంచింది. ఏదేమైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరి వెంట ఎక్కువ మంది ఉంటే వారిదే అసలు సిసలు పారీ్టగా ఎన్నికల
సంఘం గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. 

లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ? 
మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పడే ప్రభావంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ వెనక ఉండి నడిపించినట్టు ఆరోపణలు వస్తున్న ఆపరేషన్‌ అజిత్‌ పవార్‌తో ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే లాభమేమీ లేదు. ఇప్పటికే ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌ పూర్తి స్థాయి మెజారీ్టతో బలంగానే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే బీజేపీ అజిత్‌ పవార్‌ తిరుగుబాటును ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర, 48 ఎంపీ స్థానాలతో ఈ రాష్ట్రం పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.

కానీ ఇప్పుడు ఎన్డీయేతో శివసేన లేకపోవడంతో ఆ పారీ్టలో చీలికలు తెచ్చి ఏక్‌నాథ్‌ షిండే వర్గాన్ని తమ వైపు లాక్కుంది. అయినప్పటికీ గత ఎన్నికల మాదిరిగా సీట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎన్సీపీని కూడా చీల్చడానికి ప్రయతి్నంచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాలను బలహీన పరచడమే కాకుండ ప్రజాకర్షణ బలంగా ఉన్న మరాఠా నాయకులైన ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ వంటి వారి అండ బీజేపీ వైపు ఉంది. ఈ సారి కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్‌ వర్గంతో ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం చేతులు కలిపినప్పటికీ తమ వైపు ఉన్న నాయకులే బలంగా ఉన్నట్టుగా బీజేపీ నమ్ముతోంది. ఓ రకంగా మహారాష్ట్ర బీజేపీ చెయ్యి జారిపోకుండా కాపాడుకోవడానికే ఇదంతా చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సీపీ సభ్యులు: 53
శరద్‌ పవార్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు:15
అజిత్‌ పవార్‌ సమావేశానికి హాజరైనవారు:32
ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలు: 6

 –సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement