రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా | Sakshi
Sakshi News home page

రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా

Published Thu, Mar 9 2023 4:52 AM

Manik Saha Takes Oath As Tripura Chief Minister For Second Time - Sakshi

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బిరేన్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్‌ కేబినెట్‌లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
  
తిప్రా మోతా చీఫ్‌తో షా భేటీ
‘గ్రేటర్‌ తిప్రాల్యాండ్‌’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్‌ ప్రద్యోత్‌ కిశోర్‌ దేవ్‌ బర్మన్, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్‌ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్‌ అటానమస్‌ కౌన్సిల్‌కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే.

Advertisement
Advertisement