మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన

22 Jul, 2023 09:17 IST|Sakshi

ఇంపాల్‌: మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం సంచలనంగా మారింది. ఇక, ఈ విషాదకర ఘటన నేపథ్యంలో బాధితురాలి తల్లి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడారు. 

ఈ క్రమంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్తను, కుమారుడిని చంపేశారు. మణిపూర్‌లో హింసను ఆపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు ఇద్దరు మహిళలను గుంపునకు వదిలేశారని, దీంతో వారిని నగ్నంగా ఊరేగించారన్నారు. కొంత మంతి గుంపు మా ఇంటివైపు వచ్చి దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘర్షణల్లో తన చిన్న కొడుకును కోల్పోయినట్టు కన్నీటిపర్యంతమయ్యారు. అతనికి మంచి చదువు చెప్పించడం కోసం తాపత్రయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం తన పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదన్నారు. ఇప్పుడు తన భర్త కూడా లేడని కంటతడి పెట్టారు. ఇప్పుడు మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎంతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై భయంగా ఉందన్నారు. ప్రస్తుతం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామన్నారు.

మా ఊరికి వెళ్లడం ఇష్టం లేదు..
ఇదే సమయంలో మళ్లీ తాము తమ స్వగ్రామనికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం తన మనసులోనే లేదని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తమ ఇళ్లు తగులబెట్టారని, పొలాలను ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. అలాంటప్పుడు ఇక గ్రామానికి దేనికి వెళతామన్నారు. తమ గ్రామమే మంటల్లో కాలిపోయిందని, తన కుటుంబ భవిష్యత్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. 

కాగా.. తన తండ్రిని, తమ్ముడిని చంపేయడం నా కూతురు తన కళ్లతో చూసింది. ఇది తన హృదయాన్ని బాగా గాయపరిచిందన్నారు. ఇక నుండి ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భగవంతుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని, కానీ దీని గురించి పగలు, రాత్రి ఆలోచిస్తున్నానని, మానసికంగా బలహీనంగా ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. 

సీఎం బీరెన్‌ వీడియో సందేశం
మణిపూర్‌ కీచక పర్వంపై దేశం రగిలిపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ గురువారం ఉదయం లైవ్‌ ద్వారా స్పందించారు. ‘‘ఘటనపై బాధగా ఉంది. మానవత్వానికి వ్యతిరేకమైన ఈ ఘటనను.. ప్రతీ ఒక్కరూ ఖండించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాం. మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని తెలిపారు. ఇక, ఈ ఘటనకు పాల్పడిని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు