మావోయిస్ట్‌ కీలక నేత బెంగాల్‌లో అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్‌ కీలక నేత బెంగాల్‌లో అరెస్ట్‌

Published Sat, Jan 13 2024 7:45 AM

Maoist leader Sabyasachi Goswami Arrested In Jharkhand - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ పోలీసులు వాంటెడ్‌ మావోయిస్ట్‌ నేత సవ్యసాచి గోస్వామి అలియాస్‌ కిశోర్‌(55)ను అరెస్ట్‌ చేశారు. ఆయన తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జార్ఖండ్‌ సరిహద్దులకు సమీపంలోని అడవుల్లో గోస్వామిని పట్టుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బఘ్ముండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌనియా గ్రామం వద్ద ఆయన ఉన్నట్లు తెలియడంతో గురువారం రాత్రి దాడి చేసి అరెస్ట్‌ చేశామన్నారు. ఆయన నుంచి ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో గోస్వామి ఒకరు, ఆయన్ను పట్టించిన వారికి రూ.10 లక్షల బహుమానం ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది.

బంకురా, పురులియా, ఝార్‌గ్రామ్, పశ్చిమ్‌ మేదినీపూర్‌ జిల్లాల్లో మావోయిస్ట్‌ పార్టీని బలోపేతం  చేసేందుకు, నిధుల సేకరణకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. గోస్వామి అరెస్ట్‌ను అతిపెద్ద విజయంగా ఆయన పేర్కొన్నారు. ‘కిశోర్‌దా’గా మావోయిస్టులు పిలుచుకునే గోస్వామి దక్షిణ 24 పరగణాల జిల్లా సోడెపూర్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన వారు. ఇటీవలే ఆయన మావోయిస్ట్‌ పార్టీ ‘ఈస్టర్న్‌ రీజినల్‌ బ్యూరో ఇన్‌చార్జి’గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలీసులు పలుమార్లు అరెస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement