వ్యాక్సిన్‌ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి

Published Fri, Jan 1 2021 8:40 AM

Narendra Modi Advice People No Negligance On Coronavirus After Vaccine - Sakshi

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిదని ఆయన చెప్పారు. కొత్త ఏడాది అదే మన కొత్త మంత్రం అని వెల్లడించారు. రాజ్‌కోట్‌లో ఏర్పాటు చేయనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం  ప్రధాని మాట్లాడారు.  ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి దేశం సంసిద్ధంగా ఉందన్న ఆయన ప్రజలందరికీ  మేడ్‌ ఇన్‌ ఇండియా టీకాయే లభిస్తుందని చెప్పారు. ‘‘కరోనాకి ఔషధం వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని నేను గతంలో పదే పదే చెప్పాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఔషధం వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కోవిడ్‌ నిబంధలనన్నీ అందరూ పాటించి తీరాలి. 2021లో మన దేశ కొత్త మంత్రం అదే’’ అని ప్రధాని చెప్పారు. 

2021 ఒక ఆశాకిరణం
కరోనా వైరస్‌ కారణంగా 2020 అంతా నిరాశపూరిత వాతావరణంలో గడిచిందని ప్రధాని అన్నారు. కరోనా ఎప్పటికి అంతం అవుతుందా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయని అన్నారు. కానీ వైరస్‌ని తరిమికొట్టడానికి వ్యాక్సిన్‌ రూపంలో 2021లో ఆశాకిరణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. దేశంలో ప్రజలందరికీ టీకా అందుతుందని, దీనికి సంబంధించిన సన్నాహాలన్నీ తుది దశకు చేరుకున్నాయని ప్రధాని చెప్పారు. అందరికీ స్వదేశీ టీకా అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై వచ్చే వదంతులేవీ నమ్మవద్దని ప్రధాని హితవు పలికారు. కరోనా టీకాలపై ఇప్పటికే దుష్ప్రచారాలు మొదలు పెట్టారని, అవేవీ నమ్మొద్దన్నారు.

అత్యధిక జనాభా కలిగిన భారత్‌ ఇతర దేశాలతో పోల్చి చూస్తే కరోనా వైరస్‌ని సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని అన్నారు. దాదాపుగా కోటి మంది కరోనాపై పోరాటం చేసి విజయం సాధించారని అన్నారు. కరోనా మరణాలను బాగా అరికట్టామన్న ప్రధాని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేసుల సంఖ్యని సమర్థంగా కట్టడి చేశామన్నారు. కరోనా కష్టకాలంలో అలుపెరుగకుండా దేశానికి సేవ చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరినీ అభినందించారు. 2020 చివరి రోజైన డిసెంబర్‌ 31ని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి అంకితమిస్తున్నట్టుగా చెప్పారు. దేశ ప్రజలందరూ కరోనాపై కలసికట్టుగా పోరాటం చేశారని, ఆ స్ఫూర్తిని వ్యాక్సిన్‌ వచ్చాక కూడా కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement