అంత ఈజీ కాదు..! | Sakshi
Sakshi News home page

అంత ఈజీ కాదు..!

Published Thu, Aug 31 2023 5:36 AM

NDA Vs India in 2024 Lok Sabha Elections - Sakshi

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి  :
వచ్చే ఏడాది నుంచి దేశాన్ని ఓ ఐదేళ్లపాటు ఎవరు పరిపాలించబోతున్నారు? ఇప్పటికిప్పుడైతే ‘ఎన్డీయేనే.. ఇంకెవరు?’ అనే సమాధానమే వస్తుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ వరుసగా మూడోదఫా అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జరిగిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఆడుతూ పాడుతూ అందలం ఎక్కింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందా? అంటే అంత నమ్మకంగా చెప్పడానికి లేదు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్‌ సారథ్యంలో ‘ఇండియా’ కూటమిగా జతకట్టడంతో రసవత్తరమైన పోరుకు తెరలేచింది. గట్టి పోటీనిచ్చి ఎన్డీయేకు, ముఖ్యంగా బీజేపీకి చుక్కలు చూపించాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ ఉవి్వళ్లూరుతున్నాయి. మొత్తం మీద ఎన్డీయేకు ఈసారి సునాయాసంగా నెగ్గడం సులభం కాకపోవచ్చు!  

2014 నుంచి మోదీ యుగం ఆరంభం  
ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ముంబైలో గురువారం నుంచి సమావేశమై తమ కార్యాచరణ ఖరారు చేసుకోనున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ కీలక సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది చూచాయగా తెలిసే అవకాశం ఉంది. భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పోరాడితే తమ అవకాశాలు ఎలా ఉంటాయో కూడా కూటమిలోని పార్టీలన్నీ బేరీజు వేసుకోనున్నాయి.

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీయే కూటమికి వచ్చిన ఓట్ల శాతానికి కొంచెం దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే(38 పార్టీల కూటమి)కి 45 శాతం ఓట్లు వస్తే, ఇండియా కూటమి(26 పార్టీలు)కి 38 శాతం ఓట్లు లభించాయి. రెండు కూటముల మధ్య వ్యత్యాసం 7 శాతంగా కనిపిస్తోంది.

రెండు కూటముల్లోని పార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిర్ధారణకు రావొచ్చు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ పడతాయి కాబట్టి ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందనేది పరిశీలకుల అంచనా. ఎన్డీయే 2019 ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో 341 సీట్లు గెల్చుకుంది. అంతకుముందు 2014లో ఎన్డీయే 39 శాతం ఓట్లతో 353 సీట్లు సాధించింది. 2014లో ఓట్ల శాతం తక్కువైనా ఎక్కువ సీట్లు గెల్చుకోవడం గమనార్హం.

1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక కూటమి ఇన్ని సీట్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. సరిగ్గా ఇక్కడే మోదీ యుగం ఆరంభమైంది. మోదీ యుగం ఆరంభం కాకముందు 2009లో ఎన్డీయే 27 శాతం ఓట్లతో కేవలం 148 సీట్లు గెల్చుకోగలిగింది. ప్రస్తుతం ఇండియా కూటమిగా ఏర్పడ్డ పార్టీలకు 2009 ఎన్నికలు ఒక రకంగా స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఈ పార్టీలకు 2009లో 40 శాతం ఓట్లు రాగా, 347 సీట్లు దక్కాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఈ కూటమి పార్టీల ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినా 161 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఇండియా కూటమి ఓట్ల శాతం(38 శాతం), సీట్ల సంఖ్య(158) గణనీయంగా
పడిపోయాయి.  

కాంగ్రెస్‌ నష్టం బీజేపీకి లాభం  
గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే పోటాపోటీగానే కనిపిస్తున్నప్పటికీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) బీజేపీ ఆధిక్యం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. ఎన్డీయేలోని మిగతా భాగస్వామ్య పక్షాలపై బీజేపీ లేదా నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 37 శాతం ఓట్లు సాధించింది. ఇదే ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఓట్ల శాతాన్ని బీజేపీ ఒక్కటే సాధించడం విశేషం.

రెండు కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రానురాను కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారుతుండగా, బీజేపీ ఆ మేరకు పుంజుకుంటోంది. ముక్కుసూటిగా చెప్పాలంటే కాంగ్రెస్‌ నష్టం బీజేపీకి లాభంగా మారుతోంది. గణాంకాలు పరిశీలిస్తే 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ఏనాడూ 30 శాతం ఓట్ల మార్కును అందుకోలేకపోయింది. బీజేపీకి 1991 ఎన్నికల్లో 20 శాతం ఓట్లు రావడం గమనార్హం.

1991, 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓ సారూప్యత ఉంది. 1991లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీజేపీకి 20 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో ఇది తిరగబడింది. 2019లో కాంగ్రెస్‌కు 20 శాతం, బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్‌ కోల్పోయిన ఓట్లు బీజేపీ ఖాతాలో చేరడం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు 189 స్థానాల్లో ముఖాముఖి పోటీపడ్డాయి. ఇందులో బీజేపీ ఏకంగా 166 సీట్లు గెల్చుకుంది.

అంటే నేరుగా కాంగ్రెస్‌తో తలపడ్డ స్థానాల్లో బీజేపీ 88 శాతం సీట్లు గెల్చుకుందన్నమాట. అయితే, కాంగ్రెసేతర పార్టీలతో నేరుగా తలపడ్డ స్థానాల్లో బీజేపీ 47 శాతం సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఐదేళ్ల తర్వాత 2019లో బీజేపీ కాంగ్రెస్‌పైనా, కాంగ్రెసేతర పార్టీలపైనా తన గెలుపు శాతాన్ని పెంచుకుంది. బీజేపీతో నేరుగా తలపడిన ప్రతిసారీ కాంగ్రెస్‌ చతికిలపడుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మాదిరి కాంగ్రెస్‌ ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 20 శాతం ఓట్లతో 52 సీట్లు మాత్రమే గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని విజయపథాన నడిపించాలంటే కాంగ్రెస్‌ సొంతంగా తన ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలి. అదే గనుక జరిగితే బీజేపీతో నేరుగా తలపడి దాదాపు 200 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఇది బీజేపీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు.    

కొసమెరుపు  
ప్రస్తుతం ఎన్డీయే పరిస్థితి బ్రహా్మండంగా ఎదురులేని విధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ ఏమాత్రం పుంజుకున్నా, కూటమిలోని ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పట్టు బిగించినా స్వల్ప ఓట్ల శాతం తేడా కూడా బీజేపీని నిలువరించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ శక్తి ఎన్డీయేకు బలమైతే, ఐకమత్యంతో పోరాడడమే ఇండియా కూటమికి లాభిస్తుంది. గెలుపోటములు దైవాధీనం కాదు.. ఓటరాధీనం!

Advertisement

తప్పక చదవండి

Advertisement