ఓ వైపు తుపాను.. మరోవైపు పురిటి నొప్పులు

27 May, 2021 15:17 IST|Sakshi

గ్రామాన్ని చుట్టేసిన వరద నీరు 

తల్లిబిడ్డలని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌

బాలాసోర్‌ (ఒడిషా): ఆకాశానికి చిల్లులు పడేట్టుగా కురుస్తున్న వర్షం... ఊరు మొత్తాన్ని చుట్టేసిన వరద నీరు... అప్పుడే మొదలైన పురిటి నొప్పులు.. అర్థరాత్రి.. చిమ్మచీకటి.. చెట్లు కూలిపోవడంతో అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. ఇక తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని అంతా భయపడుతున్న తరుణంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్ష్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది.

తక్షణ స్పందన
ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లా బహదలాపూర్‌ గ్రామంలో రాజా, సుకాంతి దంపతులు నివిస్తున్నారు. అయితే యాస్‌ తుపాను ఒడిషాలో తీరం దాటిన రోజు రాత్రే  సుకాంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. చెట్లూ కూలిపోవడంతో కరెంటు తెగిపోయి గ్రామంలో చీకట్లు కమ్మకున్నాయి. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్లతో  రాకపోకలు ఆగిపోయాయి. ఆ విపత​‍్కర పరిస్థితుల్లోనే సుకాంతి ప్రసవించినా.. తల్లిబిడ​‍్డలకు వైద్య సాయం అత్యవసరమైంది. మరోవైపు వరద నీరు ఇంటిని చుట్టేస్తోంది. ఈ తరుణంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాజా ఫోన్‌ చేశాడు. 

తల్లిబిడ్డ క్షేమం
వాహనాలు పోయే దారి లేకపోవడంతో కాలినడకనే ఎన్డీఆర్‌ఎప్‌ బృందం బహదలాపూర్‌ గ్రామానికి అర్థరాత్రి 2 గంటలకు చేరుకుంది. స్ట్రెచర్‌ మీదనే సుకాంతిని, నవజాత శిశువుని తీసుకుని కాలినడకన దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన వివరాలను ఎన్డీఆర్‌ఎఫ​ డీసీ సత్య నారాయన్‌ ప్రధాన్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. 


చదవండి: అలజడిలో జననం

మరిన్ని వార్తలు