Nitin Gadkari says will not put up posters and banners from next election; underlines 'politics of service' - Sakshi
Sakshi News home page

‘వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు అంటించను.. అదే నన్ను గెలిపిస్తుంది’

Published Tue, May 16 2023 12:24 PM

Nitin Gadkari Says Will Go Next Elections Underlines Politics Of Service Not From Posters - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం కోసం పోస్టర్లు, బ్యానర్లపై కాకుండా సేవా రాజకీయాలపై ఆధారపడాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎలాంటి పోస్టర్లు అంటించబోనని, ఓటర్లు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో, రాబోయే ఎన్నికల్లో తనకు పోలయ్యే ఓట్లు సంఖ్యను కూడా పెంచుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఖచరియావాస్ గ్రామంలో మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ వర్ధంతి కార్యక్రమంలో హాజరైన గడ్కరీ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను గతంలో కష్టతరమైన నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఆ సమయంలో అక్కడి నుంచి పోటీ చేయవద్దని పలువురు సూచించారు. అయినా పట్టుదలతో పోరాడాను. అలానే వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నాను. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు, ఇష్టం లేనివాళ్లు వేయరు’’ అని ఆయన అన్నారు.

'సేవా రాజకీయాలు', 'అభివృద్ధి కార్యక్రమాలు', గ్రామాల్లోని పేదల సంక్షేమం, పేద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా ఓట్లు లభిస్తాయి తప్ప పోస్టర్లు, బ్యానర్లతో కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత సతీష్ పూనియా, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్‌ నుంచి వసూలు చేసుకోండి!

Advertisement
Advertisement