కరుడుగట్టిన స్క్రాప్‌ మాఫియా డాన్‌, ప్రియురాలి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

వందల కోట్ల అక్రమార్జన.. కరుడుగట్టిన స్క్రాప్‌ మాఫియా డాన్‌ అరెస్ట్‌

Published Thu, Apr 25 2024 5:21 PM

Noida Scrap Mafia don ravi kana arrested in Thailand - Sakshi

స్టీల్‌, స్క్రాప్‌ మెటిరియల్‌ పేరిట వ్యాపారం

చేసేదంతా దొంగ దందా, పన్ను ఎగ్గొట్టడమే లక్ష్యం

అక్రమ మార్గాల్లో డబ్బుకు అలవాటు పడ్డ రవి కానా

కిడ్నాప్‌లు, బెదిరింపులు, డబ్బు వసూళ్లు

మార్కెట్‌ విలువ ప్రకారం వెయ్యి కోట్ల ఆస్తులు

స్క్రాప్‌ మెటీరియల్‌ మాఫియా డాన్‌ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్‌ కాజల్‌ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్‌ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు.

నోయిడా పోలీసులు థాయ్‌లాండ్‌ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. రవీం‍ద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్‌స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్‌ మెటీరియల్‌ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్‌ మెటీరియల్ డీలర్‌ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు  సంపాదించాడు.  దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి.  పలు స్క్రాప్‌ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్‌ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్‌ అయ్యారు.

ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.  రవి తన గర్ల్‌ఫ్రెండ్‌ కాజల్‌ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలో ఉంది. దీనిని కాజల్‌ ఝా పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాడు. గౌతంబుద్ధనగర్‌, బులంద్‌ షహర్‌లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.

ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్‌ రవిని సంప్రదించిన కాజల్‌ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్‌, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement