సివిల్స్‌ వాయిదా కుదరదు

29 Sep, 2020 04:14 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీఎస్‌సీ

చేపట్టిన ఏర్పాట్లపై అఫిడవిట్‌ వేయాలని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు చేపట్టిన రవాణా ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం యూపీఎస్‌సీని ఆదేశించింది. దేశంలో కోవిడ్‌ మహమ్మారి ప్రబలంగా ఉండటంతోపాటు అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదల సమయంలో అక్టోబర్‌ 4వ తేదీన జరగబోయే సివిల్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

జస్టిస్‌ ఏ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు పక్షాల వాదనలు వింది. పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం చేపట్టిన రవాణా ఏర్పాట్లపై మంగళవారంకల్లా వివరాలతో అఫిడవిట్‌ సమర్పించాలని యూపీఎస్‌సీని ధర్మాసనం ఆదేశించింది. బుధవారం మళ్లీ విచారణ చేపడతామని తెలిపింది. అంతకుముందు..మే 31వ తేదీనే ఈ పరీక్షల తేదీలు ఖరారు చేశామనీ, వాయిదా వేయడం కుదరదని ధర్మాసనానికి యూపీఎస్‌సీ తెలిపింది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ–అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొంది.

పిటిషనర్లు వాసిరెడ్డి గోవర్దన సాయి ప్రకాశ్‌ తదితర 19 మంది తరఫున అలోక్‌ శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. దేశంలో కోవిడ్‌ వ్యాప్తి, వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే వరకు సివిల్స్‌ పరీక్షలను కనీసం మూడు నెలలపాటు వాయిదా వేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 72 నగరాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు 7 గంటలపాటు ఈ పరీక్షలను రాయాల్సి ఉంటుందనీ, చాలా మంది అభ్యర్థులు కనీసం 300–400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్, వరదల కారణంగా అభ్యర్థుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు