బామ్మ సాహసం.. తప్పిన పెను ప్రమాదం | Sakshi
Sakshi News home page

‘నువ్వు సూపర్‌ బామ్మ..’ హార్ట్‌ పేషెంట్‌ అయినా కూడా.. పెను ప్రమాదాన్ని తప్పించింది

Published Wed, Apr 5 2023 7:51 AM

An Old Lady Stopped The Train While Waving Red Cloth At Bangalore - Sakshi

సాక్షి బెంగళూరు: రైలు పట్టాలపై ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అంతలోనే ఆ పట్టాలపై రైలు వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం జరిగేదే. కానీ.. ఓ బామ్మ ఎరుపు రంగు వస్త్రంతో దేవతలా వచ్చి ఆ రైలును ఆపేసింది. ఇదేదో సినిమాలో సీన్‌ కాదు. నిజంగా జరిగిన ఉదంతం. ఈ ఘటన మంగళూరు–పడీల్‌ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో మార్చి 21వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటలకు రైలు పట్టాలపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది. దీన్ని గమనించిన 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి ఇంట్లోంచి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాలా ఊపుతూ నిలబడింది. దీనిని పసిగట్టిన లోకో పైలట్‌ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు.

‘ఏం చేయాలో పాలుపోలేదు’
ఈ ఘటనపై చంద్రావతి మాట్లాడుతూ ‘ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి బయట కూర్చొన్నాను. మా అక్క ఇంట్లోనే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం గుర్తుకొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్‌ చేసి చెబుదామని ఇంటి లోపలికి వెళ్లాను. అంతలోనే రైలు హారన్‌ వినిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు పరుగు తీశాను. నాకు గుండె ఆపరేషన్‌ అయింది. అయినా లెక్కచేయలేదు. రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిలబడి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది. సుమారు అరగంట పాటు పట్టాలపై రైలు ఆగింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారు’ అని చెప్పింది. చంద్రావతి చేసిన సాహస కార్యాన్ని ప్రజలంతా అభినందించారు.  

Advertisement
Advertisement