తొందరవద్దు, ప్రాణాలు తీస్తున్న యాప్‌లు.. క్లిక్‌ చేస్తే కష్టాలే! | Sakshi
Sakshi News home page

తొందరవద్దు, ప్రాణాలు తీస్తున్న యాప్‌లు.. క్లిక్‌ చేస్తే కష్టాలే!

Published Sat, Oct 8 2022 2:42 PM

Online Loan Apps Harassment To Users Over Money Delay Leads To Suicide - Sakshi

సాంకేతిక విప్లవం కొన్ని సందర్భాల్లో దారి తప్పుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మొబైల్‌ టెక్నాలజీ.. అదే చేత్తో ప్రజల ప్రాణాలను కూడా బలి తీసుకుంటోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లోన్‌ యాప్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారి వలలో పడి రుణాలు తీసుకు న్న అమాయకులు తిరిగి చెల్లించలేనప్పుడు వారి వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్నారు. ఇటు వంటి సంఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకుల వేధింపులు, పరువు, ప్రతిష్టలు రోడ్డున పడతాయనే భయంతో ఆందోళన లో ఏం చేయాలో తెలియక ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నారు.  

ఒక్క క్లిక్‌తో...  
మీ మొబైల్‌ ఫోన్లో ఒకే ఒక క్లిక్‌తో యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోండి... ‘హామీ లేకుండానే రుణం పొందండి’ లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు ఇచ్చే ప్రకటనలు ఇవి. హామీ అవసరమే లేదనడంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆకర్షితులై తమ మొబైల్‌లో యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుంటున్నారు. వివరాలు ఇవ్వడమే ఆలస్యం. క్షణాల్లో రూ.50వేల లోపు రుణం ఖాతాలో జమైపోతుంది. ఇలా ఆన్లైన్‌ ఆధారిత లోన్‌యాప్‌ ఉచ్చులోకి లాగుతున్నారు.

రుణం ఇచ్చేటప్పుడు హుందాగా వ్యవహరించే నిర్వాహకులు చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నారు. డౌన్లోడ్‌ చేసుకునేటప్పుడే మొబైలోని కాంటాక్టు నంబర్లు, ఫొటోలు, వీడియోలు సహా అన్నింటికీ యాప్‌ నిర్వాహకులకు యాక్సెస్‌ ఇవ్వాలి. లేదంటే రుణం రాదంటారు. యాక్సెస్‌ ఇవ్వగానే రుణం తీసుకున్న వారి రుణ యాప్‌ సర్వర్లకు అనుసంధానమవుతుంది. అవసరార్థం అప్పుఇస్తే చాలనుకునే సందర్భంలో షరతులు, నిబంధనలను చూసుకోకుండానే చాలామంది అంగీకరిస్తున్నారు. అదే వారి పాలిట యమపాశమవుతోంది.
 

దా‘రుణ’ వేధింపులు  
రుణం తీసుకున్న రోజు నుంచే చెల్లింపుల కోసం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. చెల్లింపు ఆలస్యమ య్యే కొద్దీ వేధింపులు పెరిగిపోతాయి. రుణగ్రహీత మొబైల్‌ నంబర్లకు పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే పోస్టులు, దుష్పచారాలతో కూడిన సందేశా లు, ఫొటోలు పంపిస్తారు. బెదిరింపులు లెక్క చేయకపోతే రుణగ్రహీత కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి మొబైల్‌లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్‌లలో పంపుతారు. బతికుండగానే అతడి ఫొటోకు దండేసి చనిపోయినట్లు ప్రచారం చేస్తారు. వీరి ఆగడాలను కొందరు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు ఒక యాలో అప్పు తీర్చేందుకు మరో యాప్‌లో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

 ఈజీ రుణంతో వల...  
►లోన్‌ యాప్‌లో రుణం కోసం ఎటువంటి హామీ అవసరం లేదు.  
►మొబైల్‌ ఉండి, లోన్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. 
►హామీ లేకుండా రూ.2,000 నుంచి రూ.50 వేల వరకు లోన్‌యాప్‌లో మంజూరు చేస్తారు.  
►రుణం చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా లోన్‌యాప్‌ నిర్వాహకులు ఉపేక్షించరు. 
►లోన్‌యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవడం ద్వారా మొబైలోని వ్యక్తిగత డేటా (సమగ్ర సమాచారం) నిర్వాహకుల గుప్పెట్లోకి వెళ్లిపోతుంది. 

కొత్త కొత్త పేర్లతో... 
యాప్‌లను మొబైల్‌లోని ప్లేస్టోర్‌ నుంచి తొలగించడంతో నిర్వాహకులు ఇప్పుడు కొత్తకొత్త పేర్లతో మళ్లీ తెరపైకి యాప్‌లను తెస్తున్నారు. క్యాన్‌ బెస్, లెండ్‌ మాల్‌ క్యాష్‌ అడ్వా న్స్‌ రుపీ కింగ్, రుప్‌ బాక్స్, ఓకే సన్‌ ఫైన్, టౌ న్‌ మనీ గ్రాంట్, భారత్‌ లోన్, ముషీ గ్రాంట్‌ గోల్డ్‌ బీ టెండ్‌ మాల్, భారత్‌ క్యాష్, క్యాష్‌ ఏపూర్, లెండ్‌ రోజెటెండ్, స్మాల్‌ క్యాష్, ఎక్స్‌ పీ క్యాష్, మనలీ మాస్టర్, లెండ్‌ కింగ్, లిండ్‌ పోస్ట్, కోకో ఫాస్ట్, కోకో లెండ్‌ వంటి పేర్లతో నిర్వాహకులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కొన్ని యాప్‌లలో వడ్డీ మినహా యించుకుని మిగతా మొ త్తాన్నే రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. ఉదాహరణకు రూ.10 వేలు రుణం తీసుకుంటే రూ.7,200లు జమచేస్తా రు. వారంలో రూ.10వేలు జమ చేయాలి. ఒక్కో సందర్భంలో ఒక యాప్‌లో చేసిన అప్పు తీర్చటానికి మరో యాప్‌ నుంచి అప్పు ఇప్పించేలా నిర్వాహకులే సహాయం చేస్తుండటం గమనార్హం. 

చదవండి: Viral Video: అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్‌ స్తంభాలా?

Advertisement
Advertisement