సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక

4 Apr, 2021 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇస్రో సైంటిస్టు డా.నంబి నారాయణన్‌ను 1994 కుట్ర కేసుకు సంబంధించి పోలీసులు వేధించిన అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైలెవల్‌ కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించిందని న్యాయవర్గాలు తెలిపాయి. నారాయణన్‌ను తీవ్రంగా అవమానించినందుకు రూ.50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని 2018లో ఆదేశించిన కోర్టు, అదే సమయంలో నారాయణన్‌పై పోలీసుల దాష్టీకాన్ని విచారించేందుకు మాజీ జడ్జి జైన్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పరిచింది.

కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నారాయణన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయమై ఆందోళన చెలరేగడంతో తర్వాత సీబీఐ విచారణ జరిపింది. కేరళ టాప్‌ పోలీసు అధికారులు నారాయణన్‌ అక్రమ అరెస్టుకు కారణమని సీబీఐ నిర్ధారించింది. సంచలనం సృష్టించిన ఈ అరెస్టు కారణంగా అప్పటి కాంగ్రెస్ ‌సీఎం కరుణాకరన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం జైన్‌ ఆధ్వర్యంలోని కమిటీ అరెస్టుకు దారి తీసిన కారణాలు, పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపింది. తాజాగా కోర్టుకు నివేదించిన రిపోర్టులో అంశాలు ఇంకా బహిర్గతం కాలేదు.

అసలు ఏం జరిగింది?
1994లో మాల్దీవ్‌కు చెందిన రషీదాను ఇస్రో రాకెట్‌ ఇంజెన్‌ డ్రాయింగ్స్‌ను పాకిస్థాన్‌కు అమ్ముతుందంటూ పోలీసులు అరెస్టు చేశారు. రషీదాకు అప్పటి ఇస్రోలో క్రయోజెనిక్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నారాయణన్, ఇస్రో డిప్యుటీ డైరెక్టర్‌ శశికుమారన్‌తో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మాల్దీవ్‌కు చెందిన మరో యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఈ కేసును సృష్టించారని, 1994లో తాను విక్రయించినట్లు చెబుతున్న టెక్నాలజీ అప్పటికింకా అందుబాటులోకే రాలేదని నారాయణన్‌ ఆరోపించారు.

అనంతరం ఆయన ఆరోపించిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల పాత్రపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీని నియమించింది. నారాయణన్‌ను అరెస్టు చేసి దాదాపు 50 రోజులు కస్టడీలో ఉంచి ఇబ్బంది పెట్టారని, అయితే ఆయన తప్పు లేదని తదనంతరం సీబీఐ తేల్చిచెప్పిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో కేరళ పోలీసులు ప్రాసిక్యూషన్‌ మొత్తం మోసపూరితంగా ఉందని, నారాయణన్‌కు తీవ్రమైన ఇబ్బంది కలిగించారని,  అందుకే కేరళ ప్రభుత్వాన్ని పరిహారం కట్టమని ఆదేశించింది.

చదవండి:

మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్‌ లీవ్‌

మరిన్ని వార్తలు