బైకర్‌పై దాడి.. వ్యక్తి, నెమలి మృతి

18 Aug, 2021 14:13 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో విషాదం చోటు చేసుకుంది. జనావాసంలోకి వచ్చిన ఓ నెమలి హంగామా సృష్టించింది. ఎగురుతూ వెళ్లి బైక్‌ మీద వస్తున్న ఓ వ్యక్తిని తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నెమలి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బైకర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

కేరళ అయ్యంతోల్‌ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ అనే వ్యక్తి ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రమోద్‌ తన భార్య వీణతో కలిసి బైక్‌ మీద వెళ్తున్నాడు. ఇంతలో అటుగా ఎగురుతూ వచ్చిన నెమలి.. బైక్‌ మీద ఉన్న ప్రమోద్‌ ఛాతీలో పొడిచింది. ఈ క్రమంలో ప్రమోద్‌ బ్యాలెన్స్‌ కోల్పోయి.. పక్కనే ఉన్న కంపోజిషన్‌ గోడకు గుద్దుకున్నాడు.

ఈ ఘటనలో నెమలి అక్కడికక్కడే మృతి చెందగా ప్రమోద్‌, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రమోద్‌ తీవ్ర గాయాలపాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఓ ఫారెస్ట్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇతర పక్షుల్లాగా నెమళ్లు ఎక్కువ ఎత్తు.. దూరం ఎగరలేవు. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో నెమళ్లు జనావాసంలోకి రావడం బాగా పెరిగింది’’ అని తెలిపాడు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు