బాలికపై అత్యాచారం.. సీఎం సీరియస్‌ | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై అత్యాచారం.. సీఎం సీరియస్‌

Published Thu, Aug 6 2020 7:14 PM

Perpetrators will receive harshest punishment says Kejriwal - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై ఏయిమ్స్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులను గురువారం కేజ్రివాల్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. బాలికకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో కేజ్రివాల్‌ చర్చించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని, మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమన్నారు. (రియాకు ఈడీ సమన్లు జారీ.. స్పందన లేదు)

అసలేం జరిగిందంటే..
ఢిల్లీలోని ప‌శ్చిమ విహార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ 12 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటుంది. త‌ల్లిదండ్రులు, ఆమె సోద‌రి, స్థానికంగా ఉన్న గార్మెంట్ షాపులో ప‌ని చేస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం బాలిక త‌ల్లిదండ్రులు, సోద‌రి ప‌నికి వెళ్లారు. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న బాలిక‌ను గ‌మ‌నించి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఆమెపై అత్యాచారం చేసి, శ‌రీర‌మంతా క‌త్తుల‌తో పొడిచి వికృతానందం పొందారు. అదే రోజు సాయంత్రం 5:30 గంట‌ల స‌మ‌యంలో అతి క‌ష్టంతో బాలిక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. పొరుగింటి వారు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని తొలుత సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించాగా, అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. ఆమె త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైన‌ట్లు వైద్యులు తెలిపారు. శ‌రీర‌మంతా క‌త్తిపోట్లు ఉండ‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలి ఇంటి స‌మీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement