టౌటే ఎఫెక్ట్‌: గుజరాత్‌కు రూ.వెయ్యి కోట్ల తక్షణ సాయం | Sakshi
Sakshi News home page

టౌటే ఎఫెక్ట్‌: గుజరాత్‌కు రూ.వెయ్యి కోట్ల తక్షణ సాయం

Published Wed, May 19 2021 7:33 PM

PM Announces Rs 1000 CR Relief Package for Gujarat - Sakshi

గుజరాత్‌: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ పశ్చిమ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ ఈ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్‌, డయూలో పర్యటించారు. గుజరాత్‌లో సహాయ చర్యల కోసం రూ.వెయ్యి కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్ జిల్లాలు, డయూలలో ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వే నిర్వహించిన తర్వాత ప్రధాని ఈ ప్రకటన చేశారు. అలాగే, ఈ తీవ్ర తుపాను కారణంగా మరణించిన కుటుంబాలకు రాష్ట్రాలతో సంబందం లేకుండా రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. గుజరాత్‌కు తక్షణ సహాయం కింద ఒకేసారి రూ.1,000 కోట్ల అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఈ విపత్తు వల్ల జరిగిన నష్టాల స్థాయిని అంచనా వేయడానికి ఒక అంతర్-మంత్రి బృందం రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత మరింత సహాయాన్ని విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అలాగే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితిని ప్రధాని మోదీ అధికారులను అడిగి తెలుసకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అధికారులు ఉన్నారు. ఇతర తుపాను బాధిత రాష్ట్రాలు నష్ట స్థాయిని కేంద్రంతో పంచుకున్న తర్వాత వెంటనే ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్‌ రాష్ట్రంలో తుఫాను సంబంధిత సంఘటనల్లో 45 మంది మరణించారు. టౌటే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

చదవండి:
టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి

Advertisement
Advertisement