కార్గిల్‌ విజయ్‌ దివాస్‌: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు

26 Jul, 2021 11:17 IST|Sakshi
ద్రాస్‌ సెక్టార్‌ వద్ద నివాళులు అర్పిస్తున్న త్రివిధ దళాధిపతులు

న్యూఢిల్లీ:  కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,  ‍ప్రధాని నరేంద్ర మోదీలు  ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనివని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్‌, మోదీలు కొనియాడారు. కాగా,  కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ 21 వార్షికోత్సవ వేడుకలను సోమవారం ద్రాస్‌లో నిర్వహించారు.  దీనికి మొదట దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ ద్రాస్‌ సెక్టార్‌కు వెళ్లాల్సి ఉండగా, పర్యటన చివరి నిముషంలో రద్దయింది. వాతావరణం​ పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, భారత ‍ప్రధాని నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) జరిగిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో దేశం కోసం అసువులు బాసిన సైనికులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా, అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరువదని ట్విట్టర్‌ వేదికగా సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు.

అదే విధంగా, భారత్‌ హోంమం‍త్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ బిపిన్‌ రావత్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. అమరులైన సైనికులకు తమ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చేసిన ధైర్యసాహాసాలను గుర్తుచేసుకున్నారు. అదే విధంగా, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంవద్ద రక్షణ శాఖ సహయ మంత్రి అజయ్‌ భట్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా, నేవీ వైస్‌చీఫ్‌ అడ్మిరల్‌ జి.అశోక్‌ కుమార్‌  నివాళులు అర్పించారు. కార్గిల్‌ యుధ్దం రక్షణ దళాల శౌర్యం, క్రమశిక్షణకు చిహ్నం అని అన్నారు. కాగా, వారి ధైర్యం, త్యాగానికి సెల్యూట్‌ తెలిపారు. 

కాగా, జూలై 26, 1999లో దాయాది పాకిస్తాన్‌ మన దేశాన్ని ఆక్రమించాలని.. ఎల్‌ఓసీ వద్ద భారత్‌ భూభాగంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, పాక్‌ ముష్కరులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే, ఈ యుద్ధంలో భారత భద్రతా దళాలు, పాకిస్తాన్‌ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.ఈ యుద్ధంలో భారత సైనికులు చాలా మంది మృతి చెందారు. ఈ క్రమంలో.. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ను ఆపరేషన్‌ విజయ్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు