ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్‌! | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్‌!

Published Wed, Oct 11 2023 9:28 AM

PM Modi Big Statement On Israel Crisis - Sakshi

పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌తో ఇజ్రాయెల్‌ పోరు అంతర్జాతీయ సమాజాన్ని క్రమంగా రెండుగా విడదీస్తోంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ వంటివి ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌ పాలస్తీనాకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాయి. చైనా కాస్త ఇజ్రాయెల్‌ వైపు, ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనాకేసి మొగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కల్లోలం భారత్‌కు దౌత్యపరంగా అగ్నిపరీక్షే కానుంది. పశ్చిమాసియాతో మనకున్న సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం. మధ్యప్రాచ్యంలో మరింత క్రియాశీల పాత్ర పోషించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితుల్లో వచ్చి పడ్డ ఈ పోరు మన దౌత్య చాణక్యానికి విషమ పరీక్షే కానుంది.

అధికారికంగా మౌనమే..
ఈ కల్లోలంపై విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా ఏమీ స్పందించకపోయినా, ‘దాడులను చూసి ఎంతగానో చలించిపోయా. కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటా’మని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తద్వారా ఇజ్రాయెల్‌కే తమ మద్దతని పరోక్షంగా చెప్పినట్టే అయింది. కాకపోతే ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు బాహాటంగా పూర్తిస్థాయి మద్దతివ్వడం మన ప్రయోజనాల రీత్యా శ్రేయస్కరం కాదనే వాదనలే వినిపిస్తున్నాయి.

ఇందుకు పలు కారణాలున్నాయి. అరబ్‌ లీగ్‌లో కీలకమూ, అతి పెద్దదీ అయిన సౌదీ అరేబియాతో భారత సంబంధాలు ప్రస్తుతం దూకుడు మీదున్నాయి. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆ వెంటనే ఇజ్రాయెల్‌ ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పాలస్తీనా అనుకూల సౌదీతో మన సంబంధాలను అది ప్రభావితం చేయగలదంటున్నారు. 

అంతేగాక మధ్యప్రాచ్యంలో చైనాకు పూర్తిగా చెక్‌ పెట్టి అక్కడి రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లో నిర్ణాయక పాత్ర పోషించేందుకు కొన్నేళ్లుగా భారత్‌ ప్రయత్నిస్తూ వస్తోంది. పైగా ఇటీవలే మరో కీలక పరిణామమూ జరిగింది. భారత్‌– మధ్యప్రాచ్య–యూరప్‌ ఆర్థిక కారిడార్‌ ఏర్పాటుకు ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్రంలో నిర్ణయం జరిగింది. చైనా దూకుడుగా వెళ్తున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు చెక్‌ పెట్టడం వంటివి కూడా దీని వెనక భారత్‌ లక్ష్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం తప్పటడుగు పడ్డా అరబ్‌ దేశాలతో ఇన్నేళ్లుగా నిర్మించుకుంటూ వస్తున్న సత్సంబంధాలకు విఘాతం కలిగే ఆస్కారముంది.

ఇప్పటిదాకా ఇలా..
స్వాతంత్య్రానంతరం నుంచీ ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో భారత వైఖరి కాస్త సంక్లిష్టంగానే ఉంటూ వచ్చింది. ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా 1950లో అన్యమనస్కంగానే భారత్‌ గుర్తించింది. అనంతరం కూడా చాలా ఏళ్లపాటు ఆ దేశంతో దూరమే పాటిస్తూ వచ్చింది. అదే సమయంలో పాలస్తీనా విముక్తి సంస్థ నేత యాసర్‌ అరాఫత్‌ పట్ల సానుభూతి ప్రదర్శించింది. ఇందిరా, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాలు కూడా దీన్నే కొనసాగించాయి. కానీ ఇండో చైనా యుద్ధ సమయంలో అరబ్‌ దేశాలు భారత్‌కు మద్దతివ్వకుండా తటస్థంగా వ్యవహరించడం, అనంతరం పాక్‌తో జరిగిన యుద్ధాల్లో ఆ దేశానికే దన్నుగా నిలవడంతో మన పాలస్తీనా అనుకూల విధానంపై స్వదేశంలోనే పెద్దపెట్టున విమర్శలొచ్చాయి. 

అనంతరం కువైట్‌ను ఇరాక్‌ ఆక్రమించడం, అలీన విధానం తెరమరుగు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్‌ వైఖరి బాగా మారింది. ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. వాజ్‌పేయి హయాంలో ఈ బంధం సుదృఢమైంది. కార్గిల్‌ యుద్ధ సమయంలో అత్యవసర ఆయుధ సరఫరాల ద్వారా ఇజ్రాయెల్‌ మనకు నమ్మదగ్గ మిత్రునిగా మారిపోయింది. అయినా 2014 దాకా కూడా అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనాకు మన మద్దతు కొనసాగుతూనే వచ్చింది. పాలస్తీనా పోరుకు పూర్తిగా మద్దతిస్తున్నట్టు నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామంటూ ముక్తాయించారు.        

ఆచితూచి అడుగేయాలి..
ప్రస్తుత కల్లోలం నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఏదో ఒకదానికి భారత్‌ మద్దతు ప్రకటించక తప్పదన్న అభిప్రాయాలు గట్టిగా విన్పిస్తున్నాయి. కానీ మధ్యప్రాచ్యంతో మన వర్తక, వ్యూహాత్మక బంధాలు, అవసరాల రీత్యా అదంత శ్రేయస్కరం కాదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ ఎవరి పక్షమూ వహించని విషయం తెలిసిందే.

అమెరికా తదితర దేశాలు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఉక్రెయిన్‌కు మద్దతిచ్చి వ్యూహాత్మకంగా మనకు అత్యంత కీలకమైన రష్యాను దూరం చేసుకునేందుకు ససేమిరా అంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వాటికి సూచిస్తూ వస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతులు తదితరాలను నిర్నిరోధంగా కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలోనూ అదే వైఖరిని కొనసాగించడం ప్రస్తుతానికి మేలన్నది పరిశీలకుల భావన. ‘మధ్యప్రాచ్యంతో మన సంక్లిష్ట బంధాల దృష్ట్యా కూడా ఇదే మేలు. ఎందుకంటే సౌదీ అరేబియా మనకు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. మరోవైపు ఇజ్రాయెల్‌కు మనం అతి పెద్ద ఆయుధ వినియోగదారులం’ అని వారు గుర్తు చేస్తున్నారు.
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement