NaMo Bharat: తొలి ర్యాపిడ్‌ రైలు ‘నమో భారత్‌’ను ప్రారంభించిన మోదీ | PM Narendra Modi Inaugurates NaMo Bharat, India's 1st Regional Rapid Train Service - Sakshi
Sakshi News home page

NaMo Bharat: తొలి ర్యాపిడ్‌ రైలు ‘నమో భారత్‌’ను ప్రారంభించిన మోదీ

Published Fri, Oct 20 2023 12:19 PM

PM Modi Inaugurates Namo Bharat Indias 1st Regional Rapid Train - Sakshi

భారత్‌లోనే తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ సర్వీస్‌ ‘ర్యాపిడ్‌ ఎక్స్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ–ఘజియాబాద్‌–మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కారిడార్‌కు ప్రధాని మోదీ జెండా ఊపి జాతికి అంకితం చేశారు. రైలును ప్రారంభించిన అనంతరం మోదీ అందులో ప్రయాణించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు సిబ్బందితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులు పాల్గొన్నారు.

కాగా ఈ తొలి సెమీ హైస్పీడ్‌ ప్రాంతీయ రైలును ‘నమో భారత్‌గా’ గా పేరు మారుస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–ఘజియాబాద్‌–మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్‌) కారిడార్‌లో ముందుగా 17 కి.మీ. దూరానికి సంబంధించి రైలు రాకపోకలు సాగిస్తోంది. రేపటి నుంచి (అక్టోబర్‌ 21) దేశ రాజధాని ప్రాంత వాసులకు ఈ రైలు అందుబాటులో రానుంది. మొత్తం అయిదు స్టేషన్ల మధ్య రైలు ప్రయాణించనుంది.

గత ఏప్రిల్‌లో జాతీయ రాజధాని ప్రాంత రవాణా కార్పొరేషన్‌(ఎన్‌సీఆర్‌టీసీ) ఈ ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలును ‘ర్యాపిడ్‌ఎక్స్‌’గా నామకరణం చేసింది. అనంతరం దీనిని నమో భారత్‌గా పేరు మార్చారు. దేశలోని తొలి సెమీహైస్పీడ్‌ ప్రాంతీయ రైలు సర్వీసు ప్రాజెక్టులను ఎన్‌సీఆర్‌టీసీ తీసుకొస్తుంది. ఈరైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఇక ఇప్పటికే భారతీయ రైల్వేశాఖ వందే భారత్‌ పేరుతో సెమీ హైస్పీడ్‌ రైలును నడుపుతున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రైలు పరుగులు పరుగులు పెడుతోంది. 

ఢిల్లీ–ఘజియాబాద్‌–మీరట్‌ కారిడార్‌ను ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా రూ. 30 వేల కోట్ల రూపాయలతో చేపట్టింది. ఢిల్లీ నుంచి మీరట్‌ వరకు కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి.

ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ హై స్పీడ్‌ రైల్వే వ్యవస్థ విశేషాలు

► ర్యాపిడ్‌ ఎక్స్‌ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది.
► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు గంటకు 180 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి!
► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం.
► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు.
► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు.
► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది.
► ల్యాప్‌టాప్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్‌ పుష్‌ బ్యాక్, కోట్‌ తగిలించుకునే హుక్, ఫుట్‌ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్‌ కొనుక్కునేందుకు వెండింగ్‌ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి.
► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.
► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు.
► చార్జీలు స్టాండర్డ్‌ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100.
► ప్రతి స్టేషన్‌నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు.
►ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది.
► ఢిల్లీ–గాజియాబాద్‌–మీరట్‌ మధ్య 81.15 కి.మీ. ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు.

‘ఏఐ’ బ్యాగేజ్‌ స్కానింగ్‌
ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

► ఇందులో డ్యుయల్‌ వ్యూతో కూడిన ఎక్స్‌ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కన్పిస్తాయి.
► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్‌ డిటెక్షన్‌–డిస్పోజల్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు!

Advertisement
Advertisement