mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్‌’

31 Jul, 2023 04:34 IST|Sakshi

అమరుల స్మరణకు ఆగస్టు 15 దాకా ప్రత్యేక కార్యక్రమం 

పవిత్ర మట్టితో ఢిల్లీ దాకా అమృత్‌ కలశ్‌ యాత్ర 

‘మన్‌ కీ బాత్‌’లో మోదీ

న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్‌ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.

మేరీ మాటీ.. మేరీ దేశ్‌ కార్యక్రమంలో భాగంగా అమృత్‌ కలశ్‌ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్‌ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్‌ వాటిక ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ట్‌ భారత్‌’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...  

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి  
‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్‌ మహోత్సవ్‌ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం.

స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి  లభిస్తోంది.  

మరో 50,000 అమృత్‌ సరోవరాలు   
ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్‌ సరోవరాలు నిర్మించారు.  మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్‌ను దూరం పెట్టాల్సిందే.

ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్‌తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్‌లోని బిచార్పూర్‌ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్‌బాల్‌ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు.   

కళాఖండాలు తిరిగొచ్చాయి  
మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్‌ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి.  2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా.

మరిన్ని వార్తలు