యూపీని ఒక్కటి చేస్తుంది  | Sakshi
Sakshi News home page

యూపీని ఒక్కటి చేస్తుంది 

Published Wed, Nov 17 2021 2:00 AM

PM Narendra Modi Comments at inauguration of Purvanchal Expressway - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేదరికంలోకి, మాఫియా గుప్పిట్లోకి నెట్టేశాయి.     – మోదీ  

సుల్తాన్‌పూర్‌: పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఒక్కటిగా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు.  దేశంలోనే అత్యంత పొడవైన రహదారి పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేని మంగళవారం ప్రారంభించిన అనంతరం ప్రధాని ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి వాయుసేనకు చెందిన హెర్క్యులస్‌ సీ–130జే విమానంలో మోదీ వచ్చారు. మోదీకి గవర్నర్‌ ఆనందీబెన్, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్‌–32 యుద్ధ విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

లక్నో–ఘజియాపూర్‌ మధ్య 341 కి.మీ. పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. పేదలు, మధ్యతరగతి వారు, రైతులు, వ్యాపారులు అందరికీ ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఎనలేని లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత యూపీ సీఎంలు తమ సొంతూళ్లను అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. 

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతోనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) సాధ్యపడుతుందని ప్రధాని అన్నారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో చేపట్టే ప్రాజెక్టులకు అప్పడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మోకాలడ్డిందని ఆరోపించారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కాయని చెప్పారు.  

Advertisement
Advertisement