కరోనాపై గెలుపు తథ్యం | Sakshi
Sakshi News home page

కరోనాపై గెలుపు తథ్యం

Published Sun, Jan 17 2021 4:56 AM

PM Narendra Modi launches world biggest vaccination drive - Sakshi

భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాపై భారత్‌ స్పందన ఆత్మవిశ్వాసం, స్వావలంబనతో కూడుకొని ఉన్నదని, ఇంతటి భారీ స్థాయి వ్యాక్సినేషన్‌ ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఎంతోమంది యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఇంటికి తిరిగి వెళ్లకుండా విధి నిర్వహణలోనే విగత జీవులయ్యారని గుర్తుచేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. సొంత లాభం మానుకొని పొరుగు వారికి సేవ చేయాలని పిలుపునిస్తూ మహాకవి గురజాడ అప్పారావు రాసిన ‘దేశమును ప్రేమించుమన్న..’ అనే దేశభక్తి గీతంలోని కొన్ని పంక్తులను ప్రస్తావించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... – సాక్షి, న్యూఢిల్లీ

దవాయి బీ.. కడాయి బీ
టీకా రెండు డోసులు తీసుకోవడం అత్యంత కీలకం. టీకా తీసుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. దవాయి బీ.. కడాయి బీ(టీకాతోపాటు జాగ్రత్తలు పాటించడం) అనే మంత్రం శిరోధార్యం. కరోనా వైరస్‌ ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. కరోనా బాధితులు ఇళ్లలో, ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే తల్లులు.. పెద్దలు ఆసుపత్రుల్లో ఉంటే వారి పిల్లలు దగ్గరుండి చూసుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు. ఈ వైరస్‌ వల్ల మృతి చెందిన వారు సంప్రదాయబద్ధమైన అంతిమ సంస్కారాలకు సైతం నోచుకోలేకపోయారు. కరోనాపై పోరాటంలో ఎందరో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు తమ జీవితాలను త్యాగం చేశారు. కరోనా బాధితులకు సేవలందిస్తూ వైరస్‌ సోకి వందలాది మంది విగత జీవులయ్యారు.

పనితీరు, భద్రతపై నమ్మకం కుదిరాకే..
కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు జరిగిన పోరాటంలో దేశ ప్రజలంతా ఇప్పటిదాకా ఎంతో సహనం ప్రదర్శించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోనూ అదే సహనం కొనసాగించాలి. సాధారణంగా ఒక కొత్త టీకాను అభివృద్ధి చేయాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. అలాంటిది మన దేశంలో అతి తక్కువ సమయంలోనే రెండు కరోనా టీకాలు అందుబాటులోకి రావడం గర్వకారణం. మన శాస్త్రవేత్తల శ్రమ, నైపుణ్యం వల్లే ఇది సాధ్యమయ్యింది. మరికొన్ని టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మానవతా దృక్పథానికే పెద్దపీట వేస్తున్నాం. కరోనాకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నవారికే తొలి ప్రాధాన్యం దక్కుతుంది. దేశంలో తయారైన కరోనా టీకాల పనితీరు, భద్రతపై శాస్త్రవేత్తలకు, నిపుణులకు పూర్తి నమ్మకం కుదిరాకే అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపారు. ఈ విషయంలో కుట్ర సిద్ధాంతాలు, అసత్య ప్రచారం, పుకార్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మొద్దు.  

ఫ్రంట్‌లైన్‌ యోధుల రుణం తీర్చుకుంటున్నాం
కరోనాపై దేశ ప్రజలు అసమాన ధైర్యసాహసాలతో పోరాటం సాగించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు, ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వీరిలో కోందరు తమ ఇంటికి తిరిగి వెళ్లలేదు. కరోనాపై పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన ఈ యోధులు ఇవాళ నిరాశ, భయపూరిత వాతావరణాన్ని దూరం చేశారు. రుణం తీర్చుకోవడానికి, దేశ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడానికే హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ యోధులకు తొలుత కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తున్నాం.

రెండో దశలో 30 కోట్ల మందికి టీకా
టీకా రెండు డోసుల మధ్య నెల రోజుల వ్యవధి ఉంటుంది. రెండో డోస్‌ తీసుకున్న రెండు వారాల అనంతరం మానవ శరీరం కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని సంతరించుకుంటుంది. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందజేస్తాం. ఇది ప్రపంచంలో దాదాపు 100 దేశాల జనాభా కంటే ఎక్కువ. రెండో దశలో 30 కోట్ల మందికి టీకా అందుతుంది. రెండో దశలో వయోధికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా ఇస్తాం. 30 కోట్ల కంటే అధిక జనాభా కలిగిన దేశాలు ఇండియా, అమెరికా, చైనా మాత్రమే. భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్య విధానాలు, ప్రక్రియలు, వ్యవస్థాగత యంత్రాంగం వంటివి అంతర్జాతీయంగా విశ్వసనీయత పొందాయి. ఈ విశ్వసనీయతను మన స్థిరమైన ట్రాక్‌ రికార్డ్‌తో సంపాదించుకున్నాం.

ఆరోగ్యంగా ఉండాలి..
‘భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఇది గర్వకారణమైన రోజు. ఇది మన శాస్త్రవేత్తలు, కష్టపడి పనిచేసే మన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ ఉత్సవం జరుపుకొనే సందర్భం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి’ అని ఆకాంక్షిస్తూ మోదీ శనివారం ట్వీట్‌ చేశారు.

ప్రపంచం గుర్తించింది
మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆదుకున్నాం. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాలో చిక్కుకున్న తమ ప్రజలను అక్కడే వదిలేశాయి. మనం భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలను సైతం అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చాం. తమ దేశం నుంచి వెనక్కి పంపించే భారతీయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉందని భావించిన దేశానికి మనం ఒక ప్రయోగశాలనే తరలించాం. కోవిడ్‌–19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశ ప్రతిస్పందనను ప్రపంచం గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే లభించే ఫలితానికి ఇదొక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

ఆ సవాలులో ప్రజలు ఉత్తీర్ణులయ్యారు
కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో భారతదేశం సకాలంలో అప్రమత్తమయ్యింది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో తొలి పాజిటివ్‌ కేసును గుర్తించిన 2020 జనవరి 30వ తేదీకి రెండు వారాల ముందే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పటికి ఏడాది ముందే నిఘా ప్రారంభించాం. 2020 జనవరి 17న తొలి మార్గదర్శకాలు జారీ చేశాం. విమానాశ్రయాల్లో ప్రయాణికులను తనిఖీ చేసిన తొలిదేశాల్లో ఇండియా కూడా ఉంది. జనతా కర్ఫ్యూ సమయంలో క్రమశిక్షణ, సహనానికి సంబంధించిన సవాలులో ప్రజలు ఉత్తీర్ణులయ్యారు. ఇది ప్రజలను లాక్‌డౌన్‌కు మానసికంగా సిద్ధం చేసింది. దీపాలు వెలిగించడం, ఫ్రంట్‌లైన్‌ యోధులకు మద్దతుగా చప్పట్లు కొట్టడం వంటివి దేశ ప్రజల మనోధైర్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.

శనివారం ఢిల్లీలో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ సమక్షంలో తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్‌కు ఇస్తున్న దృశ్యం


ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌కు టీకా ఇస్తున్న దృశ్యం


ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియాకు టీకా వేస్తున్న సిబ్బంది


ముంబైలో నేవీ అధికారిణి షీలా మథాయ్‌కు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

Advertisement
Advertisement