సెప్టెంబర్‌ 11.. మానవత్వంపై దాడి | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 11.. మానవత్వంపై దాడి

Published Sun, Sep 12 2021 4:02 AM

PM Narendra Modi Says September 11 was attack on humanity - Sakshi

అహ్మదాబాద్‌:  అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్‌ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్‌ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్‌ 11(9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు.

అంతేకాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్‌ భవన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇక్కడ వసతి కల్పిస్తారు. బాలికల హాస్టల్‌ అయిన సర్దార్‌ధామ్‌ ఫేజ్‌–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్‌ 11.. ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని రోజు. మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజు మొత్తం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించింది’’ అని అన్నారు. ఇలాంటి భీకర దాడుల నుంచి నేర్చుకున్న పాఠాలను సదా గుర్తుంచుకోవాలి్సన అవసరం ఉందని సూచించారు. మానవీయ విలువలను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు.

సుబ్రహ్మణ్య భారతికి అంకితం
తమిళ భాష అధ్యయనానికి బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ అనే భావనను సర్దార్‌ పటేల్‌ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు.  

సమాజానికి నూతన ఆత్మవిశ్వాసం
బ్రిటిష్‌ పాలకులను తలవంచేలా చేసిన సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ స్ఫూర్తి, శక్తి నేడు ఐక్యతా శిల్పం రూపంలో మన ముందు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్ఫూర్తి, దేశ ఐక్యత, ప్రజల ఉమ్మడి ప్రయత్నానికి ఈ శిల్పం ఒక ప్రతీక అని కొనియాడారు.  

మన సంపద దేశం కోసం
నైపుణ్యాల వృద్ధి(స్కిల్‌ డెవలప్‌మెంట్‌)కి అధిక ప్రాధాన్యం ఇస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ విధానం ఉద్దేశమని వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా లక్షలాది మంది యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని వివరించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా విశ్వాస్, సబ్‌కా వికాస్‌’కు సబ్‌కా ప్రయాస్‌ను జత చేద్దామని చెప్పారు. విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో సర్దార్‌ధామ్‌ భవన్‌ను నిర్మించిన విశ్వ పాటిదార్‌ సమాజ్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement
Advertisement