Sakshi News home page

నింగిలోకి ఎక్స్‌పోశాట్‌

Published Tue, Jan 2 2024 5:02 AM

PSLV-C58 carrying an X-Ray Polarimeter satellite, 10 other experimental payloads - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి  జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పోశాట్‌)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్‌శాట్‌నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది.

అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్‌ సెల్‌ పవర్‌ సిస్టం (ఎఫ్‌సీపీఎస్‌)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్‌ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్‌ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు.

నిప్పులు చిమ్ముతూ...
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్‌ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది.

ముందుగా ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్‌ నుంచి ఇది 92వ ప్రయోగం.

ఫ్యూయల్‌ సెల్‌ ప్రయోగం...
ఎక్స్‌పోశాట్, వియ్‌శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్‌ఎల్‌వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్‌ సెల్‌ పవర్‌ సిస్టం (ఎఫ్‌సీపీఎస్‌)తో పాటు బెలిఫ్‌శాట్, గ్రీన్‌ ఇంపల్స్‌ ట్రాన్స్‌మిటర్‌ బెలాట్రిక్స్‌ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్లో పీఎస్‌ఎల్‌వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది.

► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్‌ కీలకం కానుంది.
► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం.
► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్‌ రియాక్షన్‌ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది.
► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు.


ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ...
► ఉపగ్రహం బరువు 469 కిలోలు.
► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది.
► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది.
► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి.
► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్‌ పోలిక్స్‌ (ఎక్స్‌–పోలారిమీటర్‌ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది.
► ఇందులోని మరో పేలోడ్‌ ఎక్స్‌పెక్ట్‌ (ఎక్స్‌ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్‌) 0.8–15 కిలోవాట్స్‌ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్‌ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్‌ యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌ రూపొందించింది.
► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి.
► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్‌ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం.
► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం.

ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్‌
ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్‌ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్‌శాట్‌–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్‌–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement