వెనక్కి తగ్గని రైతులు.. రైళ్లను అడ్డుకుంటామని వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

Farmers Protest: వెనక్కి తగ్గని రైతులు.. రైళ్లను అడ్డుకుంటామని వార్నింగ్‌

Published Thu, Feb 15 2024 10:59 AM

Punjab Farmers To Block Trains In Protests Over Demands - Sakshi

సాక్షి, ఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు కేంద్రంలో మూడో విడతలో రైతులతో చర్చలు జరుపనుంది.

కాగా, చండీగఢ్‌లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ చర్చలు జరుపనున్నారు. మరోవైపు.. కొందరు రైతులు పంజాబ్‌లో రైళ్లను అడ్డుకుంటున్నటు తెలుస్తోంది. దీంతో, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా రైతులు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. పంజాబ్‌, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది మోహరించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది.

మరోవైపు.. హర్యానాలోని జింద్‌ జిల్లా దాతా సింగ్‌వాలా ఖనౌరీ సరిహద్దు వద్ద కూడా రైతులు భారీగా మోహరించి ఉన్నారు. రెండు చోట్లా బారికేడ్లను, ముళ్ల కంచెలను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దులతోపాటు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. ఇక, ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. 

ఇంటర్నెట్‌ బంద్‌
రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్‌, జింద్‌, హిసార్‌, ఫతేహాబాద్‌, సిర్సా జిల్లాల్లో వాయిస్‌ కాల్స్‌ మినహా మిగతా అన్ని మొబైల్‌ సేవలను గురువారం వరకూ అధికారులు నిలిపివేశారు.

ఢిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు
రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 144 సెక్షన్‌ అమలుతోపాటు రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో బుధవారం వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. 

Advertisement
Advertisement