Punjab Elections 2022: Police Seizes Sonu Sood's SUV at Moga Polling Station - Sakshi
Sakshi News home page

సోనూసూద్‌ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Published Sun, Feb 20 2022 3:56 PM

Punjab Police Seized Sonu Soods SUV Car Seized At Polling Booth - Sakshi

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్‌ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్‌యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్‌ సచార్‌ కోసం బాలీవుడ్‌ నటుడు మోగాలో క్యాంప్‌ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్‌యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస​ స్టేషన్‌ ఆఫీసర్‌ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్‌యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది.

మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్‌ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు.

(చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ)

Advertisement
Advertisement