Rahul Gandhi Visits Vandalised Office In Wayanad: Calls Irresponsible Act - Sakshi
Sakshi News home page

Rahul Gandhi Visits Vandalised Office: వయనాడ్‌లో రాహుల్‌

Published Sat, Jul 2 2022 1:21 AM

Rahul Gandhi Visits Vandalised Office In-Wayanad Calls Irresponsible Act - Sakshi

త్రివేండ్రం/న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని తన కార్యాలయాన్ని వారం క్రితం ధ్వంసం చేసిన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు పిల్లల్లాంటి వారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘ఈ ఘటన దురదృష్టకరం. వారు పిల్లలు. వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేవు. హింస ఏ సమస్యనూ పరిష్కరించజాలదు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సొంత లోక్‌సభ నియోజకవర్గం వయనాడ్‌ వెళ్లారు.

ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని ఆయన పరిశీలించారు. ఈ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. మరోవైపు, జీఎస్టీపై రాహుల్‌ మరోసారి మండిపడ్డారు. ‘‘మా హయాంలో జీఎస్‌టీ నిజమైన సాధారణ పన్ను విధానం కాగా, బీజేపీ ప్రభుత్వం దానిని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా మార్చేసింది’’ అంటూ ట్వీట్‌ చేశారు. జీఎస్‌టీ భారం కారణంగా దేశంలో వ్యాపారాలు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందన్నారు.

తాము అధికారంలోకి వస్తే జీఎస్‌టీ 2.0 ద్వారా చాలా సాధారణమైన, తక్కువ పన్ను విధానాన్ని తీసుకువస్తామని, రాబడిని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచుతామని వెల్లడించారు. ‘‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అమల్లోకి వచ్చిన 1,826 రోజుల్లో 6 రకాల రేట్లు, 1,000పైగా మార్పులు జరిగాయి. ఇదా సులభతరం? ఈ తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థకు, దేశంలోని పరిశ్రమలకు చేటు తెచ్చాయి’’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement