ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక

13 Feb, 2024 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్‌ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్‌ వద్ద హైటెన్షన్‌ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు.  

ఈ క్రమంలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు  ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు.

అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్‌ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు.

ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్‌ బంద్‌’ నిర్వహించాలని రాకేష్‌ టికాయత్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్‌ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది.

చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్‌ బంద్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega