Ram Jethmalani High Profile Cases: వివాదాస్పద కేసుల్లో దిట్ట రామ్‌ జఠ్మలానీ

12 Sep, 2023 12:46 IST|Sakshi

నేడు భారతదేశంలో భారీగా ఫీజులు వసూలు చేసే న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయితే వీరిలో రామ్ జెఠ్మలానీ పేరు ముందుగా వినిపిస్తుంది. అత్యధిక ఫీజులు, వివాదాస్పద కేసులు, క్లయింట్ల జాబితా కారణంగా రామ్‌జఠ్మలానీ పేరును నేటికీ తలచుకుంటుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రినూ తన హవా చాటారు. 

రామ్ జెఠ్మలానీ  1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్‌లోని షికార్‌పూర్‌లో జన్మించారు. తన 17 సంవత్సరాల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. నాటి బొంబాయి శరణార్థుల చట్టానికి వ్యతిరేకంగా జెఠ్మలానీ పిటిషన్ వేశారు. అమానవీయమైన అంశం అయినందున దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే ఆయన గెలిచిన మొదటి కేసు. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

1959లో నానావతి కేసులో జెఠ్మలానీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నేవీ అధికారి కేవాస్ మాణిక్షా నానావతి తన భార్య ప్రియుడి కాల్చి చంపి, పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ కేసులో కేవాస్ మాణిక్షా నానావతి  తరపున న్యాయపోరాటం చేయడం ద్వారా జెఠ్మలానీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1960వ దశకంలో రామ్‌జెఠ్మలానీ హాజీ మస్తాన్‌తో సహా పలువురు స్మగ్లర్ల కేసులను వాదించారు. ఈనేపధ్యంలో రామ్‌ జెఠ్మలానీ.. స్మగ్లర్ల లాయర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు.

జెఠ్మలానీ చాలా కాలం డిఫెన్స్ లాయర్‌గా ఉన్నారు. తాను న్యాయవాదిగా మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడు. అందుకే ఆయన తన దగ్గరకు వచ్చేవారు నేరస్తులా కాదా అనేది పట్టించుకోలేదని చాలామంది చెబుతుంటారు. కొన్ని కేసులను స్వీకరించేందుకు రామ్‌ జఠ్మలానీ రూ. 25 లక్షల వరకు తీసుకునేవారని అంటారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది ఆయనే. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కాశ్మీరీ ఉగ్రవాది అఫ్జల్ గురు తరపున కూడా ఆయన వాదించారు. కానీ ఈ కేసులో రామ్‌ జఠ్మలానీ విజయం సాధించలేదు. జెఠ్మలానీ గతంలో బీజేపీ నేత ఎల్‌కె అద్వానీ తరపునా న్యాయపోరాటం చేశారు. అద్వానీని సమర్థించారు. అంతే కాకుండా అమిత్ షా, లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప, జయలలిత, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన రాజకీయ నాయకులపై ఆయన కేసులు పెట్టారు.

రాంజెఠ్మలానీ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.ఆయన రెండుసార్లు బీజేపీ లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా,అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. జెఠ్మలానీ.. కాన్సైన్స్ ఆఫ్ మార్విక్, జస్టిస్ సోవియట్ స్టైల్, బిగ్ ఈగోస్-స్మాల్ మ్యాన్, కాంఫ్లిక్ట్స్ ఆఫ్ లాస్, మార్విక్ అన్‌చేంజ్డ్ అండ్‌ అన్‌రిపెంటెంట్ అనే పుస్తకాలను రాశారు. రామ్‌ జఠ్మలానీ పదవీ విరమణ చేసిన రెండేళ్ల అనంతరం 2019, సెప్టెబరు 8న అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: ఆమె మెడలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్‌!

మరిన్ని వార్తలు