రూ.2,000 నోటుపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

28 May, 2021 20:40 IST|Sakshi

2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-2021)లో కూడా కొత్తగా నోట్లు ముద్రించలేదని పేర్కొంది. మే 26వ తేదీన ఆర్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,23,875 లక్షలు.

రూ.500 నోటు, రూ.2,000 నోట్లు ఆర్ధికవ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువలో వీటి విలువ 85.7 శాతం. గత ఏడాది 83.4 శాతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్ నోట్లలో రూ.500 నోట్ల సంఖ్యే 31.1 శాతం. ఆర్‌బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో, భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసినట్లు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో రూ.2,000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 

2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి. నల్లధనం నిల్వలను అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 నోటు, పాత రూ.1,000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత రూ.1,000 నోటు స్థానంలో రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నోటు రద్దు కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్‌బీఐ రూ.2000 నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా? అనే మరో వాదన కూడా ఉంది.

చదవండి: 

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఇంకా మూడు రోజులే గడువు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు