అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు | Sakshi
Sakshi News home page

అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు

Published Thu, Dec 24 2020 4:53 AM

Ready to restart talks but Govt must stop defaming us Says Farmers Union - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా:  కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్‌ కక్కా బుధవారం చెప్పారు.   

మరిన్ని సంస్కరణలు తథ్యం  
వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా సదస్సులో తోమర్‌ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు.   

రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్‌ ద్వారా మాట్లాడారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్‌ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్‌ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్‌ ఉల్‌ హక్‌ ఢిల్లీలో  రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్‌ ఎంపీల భేటీ  
కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీలు, నేతలు గురువారం విజయ్‌ చౌక్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్‌నా«థ్‌ కోవింద్‌తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది.   

25న రైతులతో  మోదీ సమావేశం
 ప్రధాని మోదీ డిసెంబర్‌ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement
Advertisement