Rising Demand For Standing Desks To Check Health Problems - Sakshi
Sakshi News home page

చలనం..ఆలోచనల ఫలం.. స్టాండింగ్ డెస్క్‌లకు పెరుగుతున్న డిమాండ్‌..

Published Sat, Jul 8 2023 2:34 PM

Rising Demand for Standing Desks To Check Health Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టాండింగ్‌ పొజీషన్‌లో వర్క్‌ పట్ల ఆసక్తి రాను రాను పెరుగుతోంది. వివిధ ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతున్న నేపథ్యంలో కూర్చోవడం కంటే నిల్చుని పనిచేయడానికే ఉద్యోగులు ప్రాముఖ్యతనిస్తున్నారు. దీంతో స్టాండింగ్‌ డెస్క్‌లకు డిమాండ్‌ క్రమంగా పెరిగిపోతోంది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉండగా కార్పొరేట్‌ ప్రొఫెషనల్‌ అన్షుల్‌కి వెన్నునొప్పి మొదలైంది. క్రమంగా అది అతని ఇతర రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేయడం ప్రారంభించింది. దాంతో అన్షుల్‌ స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్‌ డెస్క్‌ను ఎంచుకున్నారు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది‘ అని అన్షుల్‌ చెబుతున్నారు. ఎక్కువ గంటలు కూర్చోవడం  స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా ఇప్పుడు వైద్యులు పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన కార్పొరేట్‌ ఉద్యోగులు, ఇతర డెస్క్‌ జాబ్స్‌ చేసేవారు నిలబడు...బలపడు అంటున్నారు. వీరికి స్టాండింగ్‌ డెస్క్‌లు పరిష్కారంగా మారుతున్నాయి.

కూర్చోవడం– నుంచోవడం మధ్య వ్యత్యాసం.. 
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితమవుతుంది, ఇది చిత్త వైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్‌ ఇతర పోషకాలను అందిస్తుంది. చాలా సేపు కూర్చోవడం వల్ల అలసట, బద్ధకం వస్తాయి. అయితే స్టాండింగ్‌ శక్తి స్థాయిలను పెంచి చురుకు దనాన్ని ఇస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పికి దారి తీస్తుంది. అదే  నిలబడి ఉన్న డెస్క్‌లు నిటారుగా నిలబడటానికి మన కోర్‌ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి.

ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలి విజన్లు  ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక,  మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తు న్నాయి.ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కో వడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్‌ డెస్క్‌., వీటినే సిట్‌–స్టాండ్‌ డెస్క్‌లు అని కూడా పిలుస్తారు.  కూర్చున్న,  నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి  వీలుగా ఇవి రూపొందాయి. 

చలనం...ఆలోచనల ఫలం..
నగరానికి చెందిన ప్రోగ్రామర్‌ అభిషేక్‌ మాండ్లోయ్‌ 3 నెలల క్రితం స్టాండింగ్‌ డెస్క్‌కి మారారు, దీని కోసం  కంపెనీ అతనికి ఫర్నిచర్‌ అలవెన్స్‌ మంజూరు చేసింది. ‘‘ఈ మార్పునకు నాకు రూ.27,000 ఖర్చయింది. దీని వల్ల శారీరక ఆరోగ్యమే కాదు అంతకుమించి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.  నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా పనిలో చురుకుతనం పెరిగేలా చేస్తోంది’’అని మాండ్లోయ్‌ అన్నారు. దీని గురించి  ఫిట్‌నెస్‌ అగ్రిగేటర్‌ జింపిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు అమరేష్‌ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్‌ డెస్క్‌ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందనీ తన స్టార్టప్‌లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్‌ డెస్క్‌లను  కొనుగోలు చేశారని  చెప్పారు.  అదే క్రమంలో యాపిల్‌ సంస్థ సైతం తన  కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్‌ పార్క్‌లో పనిచేసే  ఉద్యోగులందరికీ స్టాండింగ్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసిందని సమాచారం.

డెస్క్‌కు డిమాండ్‌...
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ట్రెండ్‌ బలపడడంతో అది స్టాండింగ్‌ డెస్క్‌ల  డిమాండ్‌ పెరగడానికి దారితీసింది.  ‘కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ డెస్క్‌ల సేల్స్‌ ఇప్పుడు రెట్టింపైంది‘ అని ఎర్గో డెస్క్‌ రిటైల్‌ స్టోర్‌ నిర్వాహకులు రాహుల్‌ మాథుర్‌ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సొల్యూషన్‌ల  డిమాండ్‌ 45% కంటే  పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగు తోందని  ఫర్నిచర్‌ రెంటల్‌ పోర్టల్‌ సిటీ ఫర్నిష్‌  వ్యవస్థాపకుడు నీరవ్‌ జైన్‌ వెల్లడించారు.

సరిగ్గా ఉపయోగిస్తేనే..
నగరంలోని ఓ ఆసుపత్రికి చెందిన సర్జన్‌ డాక్టర్‌ అరుణ్‌  మాట్లాడుతూ ‘‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్‌ డెస్క్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి’’ అని స్పష్టం చేశారు.  అయితే ఒంగిన భంగిమలో లేదా మరేదైనా అపసవ్య భంగిమలో గాని నిలుచుని పనిచేస్తే  అది కొత్త సమస్యలకు దారితీస్తుంది, అని ఆయన హెచ్చరిస్తున్నారు.  మణికట్టు డెస్క్‌పై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు  మోచేతులు 90–డిగ్రీల కోణంలో ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం  కూడా మంచిది కాదని అటూ ఇటూ చలనం అవసరమని అంటున్నారు.

ఇదీ చదవండి: Gita Press: 'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్‌పై ప్రధాని ప్రసంశలు..

Advertisement
Advertisement