రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో చిన్నమ్మ 

Published Sat, Oct 31 2020 7:02 AM

Sasikala Release Is Doubtful - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: శిక్షాకాలం ముగింపు దగ్గరపడింది. జరిమానా చెల్లింపే ఇంకా మిగిలింది. రూ.10 కోట్ల భారీ మొత్తం కర్ణాటక జైళ్ల ఖాతాలో జమైతే తరువాత పరిణామాలు చిన్నమ్మను చిక్కుల్లో పడేస్తాయని ఆమె వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో వారంతా శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుండగా, ఖైదీల స్రత్పవర్తన కింద శశికళ ముందే విడుదలవుతారని ఆమె న్యాయవాది పలుమార్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్‌ సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కోరినపుడు వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కాగలరని జైళ్లశాఖ బదులిచ్చింది. పెరోల్‌పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి స్రత్పవర్తన కింద 120 రోజుల మందే శశికళ విడుదల ఖాయమని ఆమె అభిమానులు ధీమాతో ఉన్నారు. జైలు అధికారులను మభ్యపెట్టి శశికళ బెంగళూరు నుంచి అనధికారికంగా బయటకు వచ్చి షాపింగ్‌లు చేసినట్లు గతంలో బెంగళూరు జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించి నిరూపించినట్లు తెలుస్తోంది. స్రత్పవర్తన పరిధిలోకి శశికళ రారని కూడా అంటున్నారు. (చదవండి: ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన)

జరిమానా చెల్లింపులో చిక్కులు.. 
స్రత్పవర్తన.. ముందస్తు విడుదల అంశాలు అటుంచితే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపులో చిక్కులు తలెత్తాయి. ఇప్పటికే అనేకసార్లు ఐటీ దాడులను ఎదుర్కొన్న శశికళకు రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మరోసారి అధికారులు ఆరాతీసే అవకాశం ఉంది. చిన్నమ్మ కోసం జరిమానా చెల్లించేందుకు ఆమె అనుచరులు కొందరు ఇప్పటికే బెంగళూరులో తిష్టవేసినట్లు తెలుస్తోంది. జరిమానా చెల్లింపు, ఆ మొత్తంపై ఐటీశాఖ నుంచి స్పష్టత, జైళ్ల శాఖ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం. ప్రభుత్వ ఆదేశాలు...వీటన్నింటికీ మరింత జాప్యం అవకాశం ఉంది. అంతేగాక కోర్టుకు దశరా, మిలాడినబి సెలవులు ముగిసిన తరువాత వచ్చేనెల 2న శశికళ విడుదలపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు.  

అప్పుడే ఆనందోత్సాహాలు.. 
శశికళ విడుదల కాకుండానే ఆమె అభిమానులు ఆనందోత్సాహాలను మొదలుపెట్టారు. ‘చోళనాడు పేరాసి చిన్నమ్మ’ అనే నినాదంతో పోలీస్, రవాణాశాఖలో పనిచేసే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు శశికళ చిత్రంతో పోస్టర్లు వెలిసాయి. మదురైలోని పలు ప్రాంతాల్లో గోడలపై అంటించిన పోస్టర్లు కలకలానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తమ ఫొటోలతో రాజకీయ ప్రచారాలకు దిగడాన్ని ఆయా శాఖలు సీరియస్‌గా తీసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో శశికళ విడుదల రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేలో ముసలం పుట్టడం ఖాయమని ఒక వర్గం ప్రచారం సంతోషంగా ఉంది. 

Advertisement
Advertisement