సెంచరీ పూర్తి చేసుకున్న సెకండ్‌వేవ్‌ | Sakshi
Sakshi News home page

సెంచరీ పూర్తి చేసుకున్న సెకండ్‌వేవ్‌

Published Fri, Mar 26 2021 3:47 AM

Second Covid-19 wave may last 100 days - Sakshi

ముంబై: కోవిడ్‌ను సమర్థంగా అరికట్టడం వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని, లాక్‌డౌన్లతో సాధ్యం కాదని ఓ నివేదిక తెలిపింది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ 100 రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని అంచనావేసింది. గత నెల నుంచి దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  వ్యాక్సినేషన్‌ను భారీగా వేగంగా అమలు చేసి వైరస్‌ వ్యాప్తిని ఆపొచ్చని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్యకాంతి ఘోష్‌ ఒక నివేదికలో స్పష్టం చేశారు.

‘గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్‌డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19 సంవత్సరాల్లో సంభవించిన స్పానిష్‌ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌లు విధించి స్కూళ్లు, చర్చిలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన జిల్లాల్లో మరణాలు, కేసుల సంఖ్యను తగ్గించడంలో లాక్‌డౌన్‌లు విఫలమయ్యాయన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు గూగుల్‌ మొబిలిటీ డేటా చెబుతోంది. కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని టీకా పంపిణీతోనే నిలువరించగలమని ఆయన తెలిపారు.

జనవరి నుంచి కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కారణంగా సెకండ్‌ వేవ్‌లో కేసులు 25 లక్షలకు మించకపోవచ్చని అంచనా వేశారు.   ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల తీవ్రతను మొదటి వేవ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి పరిస్థితితో పోల్చి చూస్తే ఏప్రిల్‌ రెండో అర్ధభాగంలో కేసులు అత్యధిక స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని సౌమ్యకాంతి ఘోష్‌ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలైన సెకండ్‌ వేవ్‌ దేశంలో 100 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రతను ఎదుర్కొనేందుకు టీకా పంపిణీ వేగవంతం కావాలన్నారు. ఇప్పటి వరకు రాజస్తాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 60 ఏళ్లుపైబడిన 20% మంది వ్యాక్సినేషన్‌ పూర్తయిందనీ, అయితే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ చాలా తక్కువగా అమలైందని తెలిపారు. రెండో వేవ్‌ తీవ్రంగా ఉన్నా టీకా అందుబాటులోకి వచ్చినందున కేసులు తగ్గే ఛాన్స్‌ ఉందన్నారు.

Advertisement
Advertisement