Siddaramaiah Keeps Key Karnataka Ministries, DK Shivakumar Gets 2 - Sakshi
Sakshi News home page

Karnataka Cabinet: కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?

Published Sat, May 27 2023 6:55 PM

Siddaramaiah Keeps Key Karnataka Ministries, DK Shivakumar Gets 2 - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది.  గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే  గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లత్‌ శనివారం రాజ్‌భన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. 

కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్‌ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్‌ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..  జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్‌కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్‌ జారికిహోళికి పబ్లిక్‌ వర్క్స్‌, బైరతి సురేష్‌కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్‌ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్‌& స్పోర్ట్స్‌, వెంకటేష్‌కు పశుపోషణ, తిమ్మపూర్‌ ఎక్సైజ్‌, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్‌ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్‌ మీడియాలోవైరల్‌గా మారింది. 

చదవండి: ఆర్‌ఎస్‌ఎస్‌ను బ్యాన్‌ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక

శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్‌. గుండురావు తనయుడు దినేశ్‌ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్‌, సంతోశ్‌లాడ్‌,  కేఎన్‌ రాజణ్ణ, కే వెంకటేశ్‌, హెచ్‌.సి.మహదేవప్ప, భైరతి సురేశ్‌, శివరాజ్‌ తంగడిగి, ఆర్‌బీ .తిమ్మాపుర్‌, బి.నాగేంద్ర, డి.సుధాకర్‌, లక్ష్మీ హెబ్బాళ్కర్‌, చలువరాయస్వామి, మంకుళ్‌ వైద్య, ఎంసీ .సుధాకర్‌, హెచ్‌.కె.పాటిల్‌, శరణ్‌ప్రకాశ్‌ పాటిల్‌, శివానందపాటిల్‌, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్‌ ఉన్నారు.

మొత్తం కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్‌ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్‌ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్‌, ఒక జైన్‌ మంత్రి ఉన్నారు.
చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే?

Advertisement

తప్పక చదవండి

Advertisement