అసదుద్దీన్‌ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి?

8 Nov, 2022 14:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్‌ ఇండియా మజ్లిజ్‌ ఈ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

సోమవారం సాయంత్రం ట్రైను సూరత్‌కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్‌ పఠాన్‌ ఆరోపించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్‌ ఓవైసీ సాబ్‌, సబిర్‌ కబ్లివాలా సర్‌, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్‌ నుంచి సూరత్‌కు వందేభారత్‌ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్‌ పఠాన్‌.

ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్‌ పర్మార్‌. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్‌ సమీపంలో ట్రాక్‌ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్‌పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. 

 అసదుద్దీన్‌ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం
 

ఇదీ చదవండి: సౌత్‌లో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

మరిన్ని వార్తలు