‘ఆప్‌’ అభ్యర్థే చండీగఢ్‌ మేయర్‌ | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’ అభ్యర్థే చండీగఢ్‌ మేయర్‌

Published Wed, Feb 21 2024 4:43 AM

Supreme Court overturns result: declares AAP candidate Chandigarh mayor - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్‌–కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కులదీప్‌ కుమార్‌ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్‌ అధికారి ‘క్రాస్‌’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్‌ కుమార్‌కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌–కాంగ్రెస్‌ అభ్యర్థి కులదీప్‌ కుమార్‌ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని  ఆర్టీకల్‌ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది.   

ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు   
మేయర్‌ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్‌’ నేత, మేయర్‌ అభ్యర్థి కులదీప్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రకటించిన 8 బ్యాలెట్‌ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్‌ మాసిని ప్రశ్నించింది.

ఆ 8 ఓట్లు కులదీప్‌ కుమార్‌కు పడినట్లు తేల్చింది. పిటిషనర్‌కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్‌ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్‌ ఎన్నిక విషయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్‌ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్‌ మాసిపై సీఆర్‌పీఎస్‌ సెక్షన్‌ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది.  

అసలేం జరిగింది?  
చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్‌లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్‌’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్‌–కాంగ్రెస్‌ అభ్యర్థి కులదీప్‌ కుమార్‌కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రకటించారు. దీంతో కులదీప్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్‌
సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్‌ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు.

నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే
సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు.

Advertisement
Advertisement