Sakshi News home page

పురుషులకు జాతీయ కమిషన్‌..  పిల్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

Published Tue, Jul 4 2023 11:00 AM

Supreme Court Rejects Plea Seeking Creation of National Commission for Men - Sakshi

న్యూఢిల్లీ: పురుషుల హక్కుల పరిరక్షణకు ‘జాతీయ కమిషన్‌ ఫర్‌ మెన్‌’ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల కేసులపై విచారణకు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్‌ న్యాయవాది మహేశ్‌ కుమార్‌ తివారీ కోరారు.

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో 1,64,033 ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 81,063 మంది వివాహితులైన పురుషులున్నారని, 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. వీరిలో కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడిన వారు 33.2% కాగా, వివాహ సంబంధిత సమస్యలతో 4.8% మంది తనువు చాలించినట్లు తెలిపారు. వివాహమైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ)ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

ఈ పిల్‌పై సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారు. పెళ్లవగానే చనిపోతున్న యువతుల డేటాను మీరివ్వగలరా? చనిపోవాలని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. పిల్‌ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement