Sakshi News home page

Black Taj Mahal: నల్లరాతి తాజ్‌మహల్‌ ఎక్కడుంది? దేనికి చిహ్నం?

Published Wed, Mar 6 2024 10:27 AM

Taj Mahal Made of Black Stones Know Where Whose Memory - Sakshi

ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్‌ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్‌ మహల్‌ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నల్లరాతి తాజ్‌మహల్‌ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్‌పూర్‌లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్‌పూర్‌ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది.

ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌ను నిర్మించాడు. 

ఈ నల్లరాతి తాజ్‌ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్‌ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి.

Advertisement

What’s your opinion

Advertisement