అచ్చోట ముచ్చెమట  | Sakshi
Sakshi News home page

అచ్చోట ముచ్చెమట 

Published Wed, Apr 17 2024 3:07 AM

These 9 seats are where the election thriller - Sakshi

తొలి రెండు విడతల్లో 9 ‘హాట్‌ సీట్లు’ 

ముఖాముఖి, త్రిముఖ, చతుర్ముఖ పోటీలు దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తున్న వైనం 

లోక్‌సభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రెండు రోజుల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కానీ ఈసారి ఎన్నికలు పరమ బోరింగ్‌గా సాగుతున్నాయన్న అభిప్రాయం గట్టిగా విన్పిస్తోంది. కాకపోతే తొలి, రెండో విడతల్లో పోలింగ్‌ జరిగే 191 లోక్‌సభ స్థానాల్లో 9 ‘హాట్‌ సీట్లు’ మాత్రం దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. రసవత్తర పోటీకి వేదికగా మారాయి. ఎందుకంటే వాటిలో కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు బరిలో దిగి ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరికొన్ని చోట్ల అగ్రనేతలకు పెనుసవాలు ఎదురవుతోంది. ఇంకొన్ని చోట్ల సిట్టింగులకు గట్టి ఎదురుగాలి వీస్తోంది. ఆ సీట్లపై ఓ లుక్కేద్దాం...! – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మళ్లీ బీజేపీ పరమేనా? 
చురు (రాజస్తాన్, ఏప్రిల్‌ 19) 
కీలక అభ్యర్థులు: దేవేంద్ర ఝఝారియా 
(బీజేపీ), రాహుల్‌ కాస్వాన్‌ (కాంగ్రెస్‌) 

ఉత్తర రాజస్తాన్‌లోని ఈ లోక్‌సభ స్థానం థార్‌ ఎడారికి ముఖద్వారం. బీజేపీ కంచుకోట. రెండుసార్లు పారాలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన జావెలిన్‌ క్రీడాకారుడు ఝఝారియా పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి కాస్వాన్‌ బీజేపీ మాజీ కావడం విశేషం! గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లోకి ఫిరాయించి పోటీని ఆసక్తికరంగా మార్చేశారు. ఆయన బలమైన జాట్‌ నేత కావడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఇక్కడి 22 లక్షల మంది ఓటర్లలో నాలుగో వంతు జాట్లే! మహిళా రెజ్లర్ల నిరసనలు, సాగు బిల్లులు తదితరాలతో జాట్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో, ‘నరేంద్రుని దేవేంద్రుడు’ ప్రచారమే దేవేంద్ర ఝఝారియాను గట్టెక్కిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. 

తమిళనాట హోరాహోరీకి వేదిక
కోయంబత్తూర్‌ (తమిళనాడు, ఏప్రిల్‌ 19) 
కీలక అభ్యర్థులు: కె.అన్నామలై (బీజేపీ), గణపతి పి.రాజ్‌కుమార్‌ (డీఎంకే), 
సింగై జి.రామచంద్రన్‌ (అన్నాడీఎంకే) 

తమిళనాట పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి ఈ స్థానం కేంద్రబిందువుగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ అన్నామలై బరిలో ఉండటమే అందుకు కారణం. దాంతో పొత్తులో భాగంగా పదేళ్లుగా వామపక్షాలకు కేటాయిస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈసారి డీఎంకే పోటీ చేయడ తప్పలేదు. నగర మేయర్‌ రాజ్‌కుమార్‌ను పార్టీ బరిలో దింపింది. జౌళి పరిశ్రమకు కేంద్రమైన కోయంబత్తూరు మాంచెస్టర్‌ ఆఫ్‌ ద సౌత్‌గా పేరుబడింది. స్థానికేతర జనాభా ఎక్కువగా ఉన్న ఈ స్థానంపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. తమిళనాడులో బీజేపీ నెగ్గిన తొట్టతొలి లోక్‌సభ స్థానాల్లో కోయంబత్తూరు ఒకటి. 1998, 1999ల్లో ఇక్కడ ఆ పార్టీ గెలిచింది! 
 
రాహుల్‌కు గట్టి పోటీ 
వయనాడ్‌ (కేరళ, ఏప్రిల్‌ 26) 
కీలక అభ్యర్థులు: రాహుల్‌గాంధీ (కాంగ్రెస్‌), అన్నీ రాజా (సీపీఐ), కె.సురేంద్రన్‌ (బీజేపీ) 

కొండ ప్రాంతమైన ఈ లోక్‌సభ సీటు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాం«దీకి సురక్షిత స్థానమని చెప్పేముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. 2019లో ఏకంగా 4.3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన రాహుల్‌ ఈసారి కేరళ బీజేపీ చీఫ్‌ కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు! మైనారిటీ ప్రాబల్య స్థానమైన వయనాడ్‌లో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రైస్తవులున్నారు. ఇండియా కూటమి భాగస్వాములు కాంగ్రెస్, సీపీఐ మధ్య ముఖాముఖి పోరు సాగుతుందని భావించినా బీజేపీ సురేంద్రన్‌ను బరిలో దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయనకు మద్దతుగా స్మృతీ ఇరానీ వంటి అగ్ర నేతలు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 

చతుర్ముఖ పోటీ! 
నగీనా (యూపీ, ఏప్రిల్‌ 19) 
కీలక అభ్యర్థులు: చంద్రశేఖర్‌ ఆజాద్‌ (ఏఎస్పీ–కేఆర్‌), సురేంద్రపాల్‌ సింగ్‌ (బీఎస్పీ), మనోజ్‌కుమార్‌ (ఎస్పీ), ఓం కుమార్‌ (బీజేపీ) 

ఈ లోక్‌సభ ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటాలు జరుగుతున్న అతి తక్కువ స్థానాల్లో నగీనా ఒకటి. ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం) అభ్యర్థి చంద్రశేఖర్‌ ఆజాద్‌ రంగప్రవేశమే ఇందుకు కారణం. స్థానికంగా తిరుగులేని ఆదరణ భీం ఆర్మీ చీఫ్‌ అయిన ఈ దళిత నేత సొంతం. ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో వారి జనాభా 20 శాతం దాకా ఉంటుంది. అయితే ముస్లింలు 43 శాతమున్నారు. వారి దన్నుకు తోడు రా్రïÙ్టయ శోషిత్‌ సమాజ్‌ అధ్యక్షుడు స్వామిప్రసాద్‌ మౌర్య మద్దతు కూడా ఆజాద్‌కు కలిసొచ్చే అంశం. 2009 నుంచి ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి గెలవలేదు! 

తీవ్ర పోటీకి వేదిక 
తిరువనంతపురం (కేరళ, ఏప్రిల్‌ 26) 
కీలక అభ్యర్థులు: శశి థరూర్‌ (కాంగ్రెస్‌), రాజీవ్‌ చంద్రశేఖర్‌ (బీజేపీ), పన్యన్‌ రవీంద్రన్‌ (సీపీఐ) 

అసలే సంప్రదాయ ప్రత్యర్థి అయిన లెఫ్ట్‌ ఫ్రంట్‌. దానికి తోడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్‌ రూపంలో గట్టి ప్రత్యరి్థ. దాంతో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశి థరూర్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎంపీగా ఆయన పనితీరుపై స్థానిక జనం పెదవి విరుస్తుండటం మరింత ప్రతికూలంగా మారింది. అర్బన్‌ సీటు కావడంతో పాటు ఏకంగా 66 శాతం  హిందూ జనాభా ఉండటం బీజేపీకి కలిసొచ్చే అవకాశముంది. రాజీవ్‌ గెలిస్తే కేరళలో కాషాయ పార్టీ నెగ్గిన తొలి స్థానంగా తిరువనంతపురం చరిత్ర సృష్టించనుంది. 2005లో ఇక్కడ గెలిచిన సీపీఐ అగ్ర నేత రవీంద్రన్‌ ఈసారి ఎవరి ఓట్లను ఏ మేరకు చీలుస్తారన్న దాన్ని బట్టి విజేత ఎవరో తేలవచ్చంటున్నారు. 

పప్పూ ప్రతీకార పోటీ! 
పూర్ణియా (బిహార్, ఏప్రిల్‌ 26)
కీలక అభ్యర్థులు: పప్పూ యాదవ్‌ (స్వతంత్ర), బీమా భారతి (ఆర్జేడీ), సంతోష్ కుమార్‌ కుషా్వహా (జేడీ–యూ) 

సీమాంచల్‌లోని ఈ సాదాసీదా లోక్‌సభ స్థానం కాస్తా రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌ రంగప్రవేశంతో సంకుల సమరానికి పోటీకి వేదికగా మారి దేశమంతటినీ ఆకర్షిస్తోంది. 1990ల్లో పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన 20 ఏళ్ల అనంతరం ఎన్నికల బరిలో దిగుతున్నారు! ఆర్జేడీ, కాంగ్రెస్‌రెండూ టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూ సిట్టింగ్‌ ఎంపీ కుషా్వహాతో పాటు ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతికి చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పప్పూ కంటతడి పెట్టిన తీరు కూడా ఓటర్లను బాగా కదిలించింది. 

గొగొయ్‌ వర్సెస్‌ గొగొయ్‌ 
జోర్హాట్‌ (అసోం, ఏప్రిల్‌ 19) 
కీలక అభ్యర్థులు: గౌరవ్‌ గొగొయ్‌ 
(కాంగ్రెస్‌), తపన్‌కుమార్‌ గొగొయ్‌ (బీజేపీ) 

ఈ స్థానం కాంగ్రెస్‌ కంచుకోట. ఒకప్పుడు మాజీ సీఎం తరుణ్‌ గొగొయ్‌ ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం బీజేపీ అభ్యర్థి తపన్‌కుమార్‌ గొగొయ్‌ గెలుపొందారు. ఈసారి రాష్ట్ర కాంగ్రెస్‌ దిగ్గజం గౌరవ్‌ గొగొయ్‌ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. తరుణ్‌ తనయునిగా కూడా ఆయనకు ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అహోం ప్రతిష్ట ప్రధానాంశంగా ప్రచారం చేస్తోంది. 2019లో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన సుశాంత బోర్గోహెయిన్‌ చేరిక బీజేపీకి కలిసొచ్చే అంశం. 

యువ నేత జోరు
బార్మేర్‌–జైసల్మేర్‌ (రాజస్తాన్, ఏప్రిల్‌ 26), 
కీలక అభ్యర్థులు: కైలాశ్‌ చౌదరి (బీజేపీ), ఉమేదా రాం బెనీవాల్‌ (కాంగ్రెస్‌), రవీంద్రసింగ్‌ భాటీ (స్వతంత్ర) 

సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి కైలాశ్‌ చౌదరితో పాటు బెనీవాల్‌కు కూడా స్వతంత్ర అభ్యర్థి రవీంద్రసింగ్‌ భాటీ చుక్కలు చూపిస్తున్నారు. ఆయన సభలకు జనం భారీగా విరగబడుతున్నారు. ఇటీవలి రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బార్మేర్‌ లోక్‌సభ పరిధిలోని షెవో స్థానం నుంచి మంచి మెజారిటీతో నెగ్గారాయన. అప్పుడూ ఇండిపెండెంట్‌గానే పోటీ చేశారు. చౌదరి పనితీరుపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటంతో భాటీ ఈసారి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దాంతో, ‘నా కారణంగా ప్రధాని మోదీని శిక్షించకండి’ అంటూ ఓటర్లను చౌదరి వేడుకోవాల్సి వస్తోంది! 19 శాతమున్న జాట్లు, 12 శాతముండే రాజ్‌పుత్‌లు ఇక్కడ నిర్ణాయకం కానున్నారు. 

కమలం వికసించేనా!
త్రిసూర్‌ (కేరళ, ఏప్రిల్‌ 26) 
కీలక అభ్యర్థులు: సురేశ్‌ గోపీ (బీజేపీ), కె.మురళీధరన్‌ (కాంగ్రెస్‌), వి.ఎస్‌.సునీల్‌కుమార్‌ (సీపీఐ) 

1952 నుంచీ ఒకసారి లెఫ్ట్, మరోసారి కాంగ్రెస్‌ నెగ్గుతూ వస్తున్న ఈ స్థానంపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ‘ఆపరేషన్‌ త్రిసూర్‌’లో భాగంగా ఈ ఆలయ నగరిని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. మలయాళ సినీ స్టార్‌ సరేశ్‌ గోపీని బరిలో దించారు. ప్రత్యర్థులిద్దరూ బలమైన నేతలు కావడంతో త్రిముఖ పోరు నెలకొంది.

Advertisement
Advertisement