Thief Hotel in Nepal, Guest House in UP has done 200 thefts - Sakshi
Sakshi News home page

కోట్లకు పడగలెత్తిన దొంగ.. నేపాల్‌లో హోటల్‌, యూపీలో గెస్ట్‌హౌస్‌, లక్నోలో ఇల్లు..

Published Wed, Aug 16 2023 12:03 PM

Thief Hotel in Nepal Guest House in up has Done 200 Thefts - Sakshi

దేశరాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఈ దొంగ తన దొంగసొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్‌ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఈ దొంగ.. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా చోరీలు చేశాడు. ఇతనిని పోలీసులు వివిధ పేర్లతో తొమ్మిదిసార్లు అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ తన భార్య పేరుతో సిద్ధార్థనగర్‌లో గెస్ట్‌హౌస్‌, తన పేరుతో నేపాల్‌లో ఒక హోటల్‌ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. 

మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం మోడల్‌ టౌన్‌ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోటీశ్వరుడైన ఒక హోటల్‌ వ్యాపారిని అరెస్టు చేశారు. అతనిని మనోజ్‌చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనొక్కడే 200కుపైగా చోరీలు చేశాడని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ‍ప్రకారం మనోజ్‌ చౌబే(45) కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్‌లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్‌కు తరలివెళ్లింది. మనోజ్‌ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్యాంటీన్‌ నిర్వహించాడు. క్యాంటీన్‌లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోతుండేవాడు.  

ఈ చోరీ సొమ్ముతో మనోజ్‌ నేపాల్‌లో హోటల్‌ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలో తాను ఢిల్లీలో పార్కింగ్‌ కంట్రాక్టు పనులు చేస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు.  మనోజ్‌ను తాజగా అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా? 

Advertisement
Advertisement