నర్సును పక్కనబెట్టి వ్యాక్సిన్‌ వేసిన కౌన్సిలర్‌; వీడియో వైరల్‌

3 Jul, 2021 19:20 IST|Sakshi

కోల్‌కతా: నర్సు పక్కన ఉండగానే తృణముల్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ వ్యాక్సిన్‌ వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన కోల్‌కతాకు 200 కిమీ దూరంలో ఉన్న అసన్‌సోల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో చోటుచేసుకుంది. ఏ మాత్రం అనుభవం లేకుండానే కౌన్సిలర్‌ వ్యాక్సిన్‌ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రియో తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఇష్టారీతిన వ్యవహరిస్తుంది. అనుభవం ఉన్న నర్సులను పక్కన కూర్చోబెట్టి ఒక కౌన్సిలర్‌ వ్యాక్సిన్‌ వేయడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ వ్యాక్సిన్‌ వేసే సమయంలో ఆ మహిళకు ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. పాలక సభ్యులపై టీఎంసీకి నియంత్రణ లేనట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు.

ఇక విషయంలోకి వెళితే.. శనివారం అసన్‌సోల్‌ క్యాంప్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎలా వేస్తున్నారనే దానిని పరిశీలించడానికి తృణమూల్ కౌన్సిలర్ తబస్సుం అరా  అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వచ్చిన ఒక మహిళను కుర్చీలో కూర్చోబెట్టి తాను వ్యాక్సిన్‌ వేస్తానని తబస్సుం నర్సుకు తెలిపారు. ఆ తర్వాత ఆమె వ్యాక్సిన్‌ ఉన్న సిరంజిని తీసుకొని మహిళకు వ్యాక్సిన్‌ వేశారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్‌ కెమెరాలో బందించాడు. 

ఇక తబస్సుం తన వీడియో వ్యవహారం బయటికి రావడంతో స్పందించారు. '' నేను ఆ మహిళకు వ్యాక్సిన్‌ వేయలేదు. కేవలం ఖాళీ సిరంజీని నా చేతిలో పట్టుకొని ఆమెకు ఇచ్చినట్లు చేశాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని నాపై విమర్శలు చేస్తున్నారు.అయినా నేను నర్సింగ్‌ కోర్సు నేర్చుకున్నా.. దీనిలో నాకు అనుభవం ఉందని'' చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కౌన్సిలర్‌  వ్యాక్సిన్‌ ఇచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు