అడవులను పెంచేందుకు విత్తన బాంబులు | Sakshi
Sakshi News home page

అడవులను పెంచేందుకు విత్తన బాంబులు

Published Mon, Jul 18 2022 4:30 AM

Uttarakhand CM Kicks Off Seed Bomb Spreading Campaign - Sakshi

డెహ్రాడూన్‌: కోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు.. దేశమంతటా ఇప్పుడొక పెను సమస్య. ఆహార కొరతకు తాళలేక తమ సహజ ఆవాసాలైన అడవులను వదిలేసి ఊళ్లపై పడుతున్నాయి. తోటలు, పంట పొలాలను పాడు చేస్తున్నాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ జంతువుల వల్ల జరిగే నష్టాన్ని భరించలేక చాలాచోట్ల ఏకంగా సాగుకే దూరమవుతున్నారు.

ఇక కోతుల వల్ల ఊళ్లలో జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉత్తరాఖండ్‌కు చెందిన ద్వారకా ప్రసాద్‌ సెమ్వాల్‌ను ఈ పరిస్థితి బాగా ఆలోచింపజేసింది. అడవుల్లో వృక్ష సంపద నశిస్తుండడం, జంతువులక ఆహారం దొరక్కపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. పరిష్కారానికి నడం బిగించారు. ఆ క్రమంలో ఆయన మదిలో మొలకెత్తిన ఆలోచనే... విత్తన బాంబులు.

ఉత్తరాఖండ్‌లో శ్రీకారం
అడవుల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తే జంతువులు పంట పొలాలపై దాడి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే వాటికి అడవుల్లోనే ఆహారం లభించే ఏర్పాటు చేయాలని ద్వారకా నిర్ణయించారు. పండ్లు, కూరగాయల మొక్కలు నాటేందుకు విత్తన బాంబులు రూపొందించారు. మట్టి, కంపోస్టు ఎరువు, విత్తనాలతో టెన్నిస్‌ బంతుల పరిమాణంలో తయారు చేశారు. 2017 జూలై 9న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ చేతుల మీదుగా ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో, అడవుల్లో విత్తన బాంబులు వెదజల్లారు. వర్షం పడగానే అవి మొక్కలుగా ఎదిగాయి. పండ్లు, కూరగాయలు పండి జంతువులకు ఆహార కొరత తీరింది. ఇందుకు ద్వారకా ప్రసాద్‌ పెద్ద యజ్ఞమే చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీలను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. అక్కడి వాతావరణానికి సరిపోయే విత్తనాలను స్థానికుల నుంచే సేకరించారు. ఈ యజ్ఞంలో 2 లక్షల మంది చేయూతనిస్తున్నారు. వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆనందగా చెబుతున్నారు ద్వారకా!

18 రాష్ట్రాల్లో సేవలు
ద్వారకా ప్రసాద్‌ హరిత ఉద్యమం 18 రాష్ట్రాలకు విస్తరించింది. రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, పంజాబ్, చండీగఢ్, ఒడిశా, తమిళనాడు, అస్సాం, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో అడవులను పెంచే పనిలో ప్రస్తుతం ఆయన నిమగ్నమయ్యారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తనకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పారు. మిగతా          రాష్ట్రాలకు సేవలను విస్తరింపజేస్తానన్నారు.

 

Advertisement
Advertisement