చర్య తీసుకున్నాం.. అదే ఫైనల్‌

1 Dec, 2021 04:49 IST|Sakshi
రాజ్యసభలో మాట్లాడుతున్న వెంకయ్య, రాజ్యసభలో ప్రసంగిస్తున్న ఖర్గే

12 మంది ఎంపీల సస్పెన్షన్‌ రద్దు చేయడం కుదరదు 

రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాల్లో సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయడాన్ని చైర్మన్‌ వెంకయ్య నాయుడు మంగళవారం సమర్థించారు. వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించారని, అయినప్పటికీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ‘12 మందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. చర్య తీసుకున్నాం. ఇక అదే ఫైనల్‌’ అని తేల్చిచెప్పారు.

ఈ సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని వెంకయ్య తిరస్కరించారు. అంతకముందు సభలో ఖర్గే మాట్లాడుతూ.. 12 మందిని సస్సెండ్‌ చేస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రవర్తన సక్రమంగా లేని సభ్యులను సభ నుంచి బహిష్కరించే అధికారం సభాపతికి ఉందని వెంకయ్య గుర్తుచేశారు. సస్పెన్షన్‌ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు వెంకయ్య అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. 

సస్పెన్షన్‌ను రద్దు చేయండి
ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని 16 విపక్షాల నేతలు మంగళవారం వెంకయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అనుచిత ప్రవర్తను క్షమాపణ చెప్పాలని వెంకయ్య సూచించినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతలు తొలుత కాంగ్రెస్‌ ఎంపీ ఖర్గే చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాహుల్‌ హాజరైనట్లు తెలిసింది. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఆర్‌ఎస్, ఆర్‌ఎస్పీ, ఆమ్‌ ఆద్మీ, ఎండీఎంకే, ఎల్‌జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర ప్రతిపక్షాల భేటీకి తృణమూల్‌  హాజరుకాకపోవడం గమనార్హం. ఈ సెషన్‌ మొత్తం సస్పెండైన 12 మంది ఎంపీలలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు.  ఎంపీలపై నిబంధలనకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని ఖర్గే తెలిపారు. ఇలా చేయడం రూల్స్‌ ఆప్‌ ప్రొసీజర్, కాండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ ద కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌లోని రూల్‌ 256(1)ను ఉల్లంఘించడమే అవుతుందని వెంకయ్యకు లేఖ రాశారు.

దిగువ సభలో నిరసనల హోరు 
లోక్‌సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. రైతాంగం సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. తొలుత సభ ప్రారంభం కాగానే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టగానే టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, వామపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు చేశారు.

వెనక్కి వెళ్లి, సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ బిర్లా పదేపదే కోరినప్పటికీ టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాల ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సేవలు) సవరణ బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్‌ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.  

క్షమాపణ ఎందుకు చెప్పాలి?: రాహుల్‌ 
ఎందుకోసం క్షమాపణ చెప్పాలి? ప్రజా సమస్యల ను పార్లమెంట్‌లో ప్రస్తావించినందుకా? క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు