ఆ రైల్వే కూలీకి ఇద్దరు బాడీగార్డులెందుకు?

24 Sep, 2023 13:20 IST|Sakshi

అతని పేరు ధర్మనాథ్‌ యాదవ్‌.. బీహార్‌లోని పట్నా రైల్వే జంక్షన్‌లో కూలీ. సాయుధులైన ఇద్దరు పోలీసు బాడీగార్డుల  నడుమ థర్మనాథ్‌ కనిపిస్తుంటాడు. వారిలో ఒకరు బీహార్‌ పోలీస్‌ కాగా మరొకరు జీఆర్‌పీ జవాను. వీరిద్దరూ అతని పక్కన నడుస్తుండగా, అతను ప్రయాణికుల బ్యాగులను మోసే పనిచేస్తుంటాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పొద్దుపోయేవారకూ అతను ఈ బాడీగార్డుల మధ్యనే ఉంటూ, తన విధులు నిర్వహిస్తుంటాడు. 

అది అక్టోబరు 27, 2013.. ఉదయం 9.30 గంటలు. బాంబుల మోతతో పట్నా జంక్షన్‌ దద్దరిల్లిపోయింది. నలువైపులా పొగలు కమ్ముకున్నాయి. వీటి మధ్య ఒక ఎర్రటి టవల్‌ మెడలో వేసుకున్న ఒక వ్యక్తి.. టాయిలెట్‌ నుంచి రక్తంతో తడిసి ముద్దయిన ఒక యువకుడిని భుజాన వేసుకుని బయటకు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు 1989 నుంచి ఇదే స్టేషన్‌లో పనిచేస్తున్న కూలీ ధర్మనాథ్‌. ఆయన టాయిలెట్‌ నుంచి బయటకు తీసుకు వచ్చిన యువకుడు ఉగ్రవాది ఇమ్తెయాజ్‌.

ఒకవేళ ఆ రోజు ధర్మనాథ్‌ ఉగ్రవాది ఇమ్తెయాజ్‌ను బయటకు తీసుకురాకుండా ఉంటే ఆ మరుక్షణంలో గాంధీ మైదాన్‌, బోధ్‌గయలో జరగబోయే బాంబు పేలుళ్లు ఆగేవికాదు. గాంధీమైదాన్‌లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని ఇమ్తియాజ్‌ స్వయంగా పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు గాంధీ మైదాన్‌, బోధ్‌గయ ప్రాంతాల్లో జరగబోయే బాంబు పేలుళ్లను నిలువరించగలిగారు. 

ఈ ఘటన జరిగిన నాటి నుంచి థర్మనాథ్‌కు పాకిస్తాన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ధర్మనాథ్‌ తనకు తగిన రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపధ్యంలో కోర్టు అతనికి రక్షణగా ఒక బాడీగార్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ బాడీగార్డు అతనికి పోలీస్‌ స్టేషన్‌లో మాత్రమే రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ధర్మనాథ్‌ తాను బయటకు వెళ్లినప్పుడు కూడా రక్షణ కల్పించాలని కోర్డును వేడుకున్నాడు. దీంతో కోర్టు 2023లో ధర్మనాథ్‌కు మరొక పోలీసు కానిస్టేబుల్‌ ద్వారా రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా కూలీ ధర్మనాథ్‌ మాట్లాడుతూ తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని, స్టేషన్‌లోని కూలీల విశ్రాంతి గదిలోనే ఉంటున్నానని తెలిపాడు. రాత్రి వేళలో ఇద్దరు బాడీగార్డులు కూడా వారి ఇళ్లకు వెళ్లిపోతారని, తనకు ఇల్లు ఉంటే వారు తనతో పాటు రాత్రి కూడా ఉంటారని చెబుతున్నాడు. అందుకే తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. 
ఇది కూడా చదవండి: భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు!

మరిన్ని వార్తలు