2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు: కేంద్రం | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు వర్తించదు.. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు: కేంద్రం

Published Wed, Sep 20 2023 7:10 PM

Women Reservation Bill Not Apply For 2024 Elections Says Centre - Sakshi

సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వర్తించబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌ తీర్మానం ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. 

ఓటింగ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మాట్లాడుతూ.. వచ్చే  ఎన్నికలకు ఈ బిల్లు వర్తించదు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీ లిమిటేషన్‌ చేపడతాం. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు వర్తిస్తుంది అని వ్యాఖ్యానించారాయన.  

ఇక బిల్లుపై చర్చ సందర్భంగా 60 మంది ఎంపీలు మాట్లాడారని.. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని మంత్రి అర్జున్‌ రామ్‌ తెలిపారు.మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ అభివృద్ధి యాత్ర అసంపూర్ణమని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో మంత్రి లోక్‌సభలో ప్రస్తావించారు. 

బిల్లుపై లొల్లి
ఇదిలా ఉంటే.. అంతకు ముందు బిల్లుపై హోం మంత్రి అమిత్‌ షా సైతం ఇదే సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు వర్తించదని.. ఎన్నికల తర్వాత జనాభా లెక్కుల, డీ లిమిటేషన్‌ ప్రక్రియ చేపడతామని తెలిపారు.  2029 ఎన్నికల సమయంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారాయన. ఆ సమయంలో.. బిల్లు అసంపూర్తిగా ఉందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమిత్‌ షా మాట్లాడుతుండగానే.. రాహుల్‌ గాంధీ లేచి వెళ్లిపోగా.. ఓటింగ్‌ కంటే ముందు కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతివ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మీరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే, రిజర్వేషన్లు త్వరగా జరుగుతాయా? మీరు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, కనీసం హామీ అయినా ఉంటుంది అని అమిత్‌ షా విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.అయినప్పటికీ కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement