దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ

15 Mar, 2021 00:55 IST|Sakshi

విపక్షాలకు మమత హెచ్చరిక 

నందిగ్రామ్‌ దివస్‌ ర్యాలీలో పాల్గొన్న దీదీ

వీల్‌చైర్‌ మీద నుంచే ప్రచారం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన తర్వాత జరిగిన ఘటనలో కాలికి గాయమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. తనలోని పోరాట పటిమను ప్రదర్శిస్తూ వీల్‌చైర్‌లో కూర్చొనే తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. 2007లో నందిగ్రామ్‌లో రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిపిన భూ సేకరణ రణరంగంగా మారి పోలీసు కాల్పుల్లో మరణించిన 14 మంది గ్రామస్తుల స్మృత్యర్థం నందిగ్రామ్‌ దివస్‌ కార్యక్రమం ఆదివారం జరిగింది. సీనియర్‌ నాయకులు వెంటరాగా మాయో రోడ్డు నుంచి హజ్రా వరకు అయిదు కి.మీ. రోడ్‌ షోలో మమత పాల్గొన్నారు.

భద్రతా సిబ్బంది వీల్‌చైర్‌ని ముందుకు తోస్తూ ఉంటే, ఆమె ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. గంట సేపు కొనసాగిన ర్యాలీ అనంతరం ప్రజలనుద్దేశించి మమత మాట్లాడారు. తనపై ఎన్నో సార్లు దాడులు జరిగాయని, అయినప్పటికీ ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని చూపిస్తూ గాయపడ్డ పులి మరింత ప్రమాదకారి అని విపక్ష పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వైద్యులు నన్ను ఇంకా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి వెళ్లొద్దని సూచించారు. కానీ ఎలాగైనా ఇవాళ ప్రజల ముందుకు రావాలని అనుకున్నాను. తమ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తూ ఉండడంతో ప్రజలు అనుభవిస్తున్న బాధతో పోల్చుకుంటే నా బాధ చాలా చిన్నది’’అంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు.

మమత భద్రతా అధికారిపై ఈసీ వేటు
భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా తనపై దాడి చేయించిందని మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. మమత భద్రతా అధికారుల వైఫల్యం కారణంగానే ఆమెకి గాయాలయ్యాయని ఈసీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు పరిశీలకులు అజయ్‌ నాయక్, వివేక్‌ దూబేలు ఇచ్చిన నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను సమీక్షించిన అనంతరం దీదీపై జరిగింది దాడి కాదని ఈసీ వెల్లడించింది. ఈ దాడికి బాధ్యతగా మమత భద్రతా డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి వివేక్‌ సహాయ్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న సీఎంకి సరైన రక్షణ కల్పించాలన్న ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వివేక్‌ విఫలమయ్యారు. ఆయనపై వారంలోగా అభియోగాలు నమోదు చెయ్యాలి’’అని పేర్కొంది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి, డీజీపీ చర్చించుకొని వెంటనే కొత్త భద్రతా డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి అయి ఉండి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మమత వాడకపోవడం భద్రతాపరమైన లోపమేనని ఈసీ తెలిపింది. మమత సాధారణ వాహనంలో ప్రయాణిస్తూ ఉంటే, ఆమె భద్రతా అధికారి వివేక్‌ సహాయ్‌ బుల్లెట్‌ ఫ్రూప్‌ కారులో ప్రయాణిస్తూ ప్రచారానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. బందోబస్తు సరిగా నిర్వహించనందుకు పూర్వ మిడ్నాపూర్‌ ఎస్పీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ని సస్పెండ్‌ చేసింది. ఆయన స్థానంలో సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను నియమించింది. జిల్లా ఎన్నికల అధికారిగా విభూ గోయెల్‌ స్థానంలో ఐఏఎస్‌ అధికారిణి స్మితా పాండేను ఈసీ నియమించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు