హిజాబ్‌ తీర్పు ఇచ్చిన జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత! సీఎం బొమ్మై మండిపాటు

20 Mar, 2022 15:11 IST|Sakshi

హిజాబ్‌ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు  వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్‌ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్‌ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్‌(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక​ డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్‌ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్‌ జనరల్‌కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు.   

భగవద్గీత సిలబస్‌లో.. 
నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్‌ సిలబస్‌లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్‌ స్కూల్‌ సిలబస్‌లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. 

 ఆ స్టూడెంట్స్‌కు షాక్‌
హిజాబ్‌ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు