మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన యోగా గురు రామ్‌దేవ్ బాబా..

28 Nov, 2022 14:16 IST|Sakshi

మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారని యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా పంపింది. దీంతో రామ్‌దేవ్ బాబా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు లేఖ విడుదల చేశారు.

మహారాష్ట్ర థానెలో శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ నోరు జారారు రామ్‌దేవ్ బాబా. మహిళలు చీరకట్టులోనైనా, సల్వార్ సూట్లోనైనా అందంగా కన్పిస్తారని, తన దృష్టిలో వాళ్లు దుస్తులు లేకపోయినా బాగుంటారని అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దీనిపై మహిళా నేతలు సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. వివాదం మరింత ముదురుతుందని భావించి రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పారు.

రామ్‍దేవ్ బాబా మహిళల దుస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత, సీఎం ఎక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగానూ వివాదాస్పదమైంది. రామ్‌దేవ్ అసలు మనస్తత్వం ఏంటో భయటపడిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ మండిపడింది.

దుస్తుల ప్రస్తావన ఎందుకు?
యోగా క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సల్వార్ సూట్లు ధరించారు. యోగా అనంతరం వెంటనే సమావేశం నిర్వహించడంతో వారు చీర కట్టుకునేందుకు సమయం కూడా లేకపోయింది. దీంతో వారంతా సల్వార్ సూట్‌లోనే మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడుతూ రామ్‌దేవ్ నోరుజారారు.

చదవండి: భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు