17కిలోల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

17కిలోల గంజాయి పట్టివేత

Published Wed, Jun 14 2023 12:56 AM

మాట్లాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆసిస్టెంట్‌ కమిషనర్‌ కిషన్‌, సీఐలు వేణుమాధవ్‌, స్వప్న - Sakshi

ఖలీల్‌వాడి: వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 17కిలోల గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కిషన్‌ తెలిపారు. నగరంలోని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం అడవిమామిడిపల్లి వద్ద గంజాయిని తరలిస్తున్న ని స్సార్‌ నుంచి 15.225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

గంజాయితోపాటు బైక్‌ను, నిస్సార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్‌లోని జిరాయిత్‌నగర్‌లో సోదాలు నిర్వహించగా అక్బర్‌ అనే వ్యక్తి నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి నిజామాబాద్‌కు బస్సులో గంజాయిని తరలించినట్లు విచారణలో తేలిందన్నారు. బస్సులలో తీసుకువచ్చిన గంజాయిని స్థానికంగా అమ్ముతారని తెలిపారు.

జిల్లాలో గంజాయి అమ్మకాలు సాగిస్తే వివరాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సమాచారం అందించాలని, వారి వి వరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను అసిస్టెంట్‌ కమిషనర్‌ కిషన్‌ అభినందించారు. సీఐలు స్వప్న, వేణుమాధవరావు, ఎస్సై రాంకుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ శివప్రసాద్‌, రాజన్న, కానిస్టేబుళ్లు ఉత్తమ్‌, రాంబచన్‌, శివ, విష్ణు, భోజన్న, హమీద్‌, గంగారాం, మంజుల, సుకన్య, అవినాష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement